కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయితే.. ఎక్కువ మంది చిన్నారులు కూడా ఈ వైరస్ బారినపడినట్లు రికార్డులు చెబుతున్నాయి.

కేవలం తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 31 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా పదేళ్లలోపు వయసున్నవారని ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ తెలిపారు. 

తమిళనాడులో కొత్తగా 98 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1173కు చేరింది. ఇప్పటి వరకు 58 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా మరణాలు సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 2,091 మంది కరోనా పరిశోధన ఫలితాలు వచ్చాయని, వాటిలో 98 మంది పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడించారు.

 ఇప్పటివరకు మొత్తం 12,746 మందికి కరోనా పరీక్షలు జరిపారు. ఇంకా 33,850 మంది హోం క్వారంటైన్‌లో, 136 మంది ప్రభుత్వ వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.

అలాగే 63,380 మంది 28 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్రంలో పరిశోధన ల్యాబ్‌ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. సోమవారం నాటికి 34 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. 

 రాష్ట్రంలో సామాజిక వ్యాప్తికి ఆస్కారం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందరం కలిసి సంయుక్తంగా పోరాడి కరోనాపై జయించాలమని, అందుకు సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యమని బీలా రాజేష్‌ పేర్కొన్నారు.