తమిళనాడులో రాష్ట్రీయ స్వయసేవక్ సంఘ్ నేతల నివాసాలపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా మధురై జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై దుండగులు మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. 

తమిళనాడులో రాష్ట్రీయ స్వయసేవక్ సంఘ్ నేతల నివాసాలపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా మధురై జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై దుండగులు మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎంఎస్ కృష్ణన్ నివాసం వైపు ఓ వ్యక్తి చేతిలో పెట్రోల్ బాంబులతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని వెనకాల మరో వ్యక్తి బైక్‌పై వచ్చాడు. పెట్రోల్ బాంబులు చేతిలో ఉన్న వ్యక్తి.. కృష్ణన్ ఇంటి గేట్ ముందుకు వెళ్లి ఇంటిపై దాడి చేశాడు. మూడు పెట్రోల్ బాంబులను ఇంటిపై విసిరాడు. అనంతరం తన వెనకాలే వచ్చిన బైక్‌పై ఎక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఈ ఘటన శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చోటుచేసకున్నట్టుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఈ దాడి జరిగిన సమయంలో కృష్ణన్, అతని కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అయితే రెండు పెట్రోల్ బాంబులు కారణంగా చిన్నపాటి మంటలు చెలరేగాయి. అయితే మరో పెట్రోల్ బాంబు మాత్రం పేలనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా వారి ముఖం కనిపించకుండా హెల్మెట్‌లు, మాస్క్‌లు ధరించారు. అయితే వారి ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై ఆర్‌ఎస్‌ఎస్ నేత కృష్ణన్ స్పందించారు.. ‘‘నేను గత 45 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నాను. రాత్రి 7 గంటల సమయంలో బయట శబ్దం వినిపించింది. పెట్రోల్ బాంబులు విసిరి నా కారుకు నిప్పంటించారు. తమిళనాడులో మాత్రమే నాలాంటి 20 మందికి పైగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మేము దాని గురించి ఫిర్యాదు చేశాం’’ అని కృష్ణన్ తెలిపారు. ఇక, ఇటీవల బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు పెరగడాన్ని ప్రస్తావిస్తూ తమిళనాడు బీజేపీ విభాగం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది.

Scroll to load tweet…


వరుస ఘటనలు..
శనివారం తెల్లవారుజామున కూడా తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని తాంబరంలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో పెద్దగా ఆస్తినష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. 

అంతకుముందు కోయంబత్తూర్‌లోని కోవైపుదూర్‌లో ఇదే విధమైన సంఘటనలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్‌ఎస్ కార్యకర్త నివాసంపై పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. దాడి తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇక, కునియముత్తూరు నగరంలోని బీజేపీ కార్యకర్త శరత్ నివాసంపై శుక్రవారం రాత్రి బాటిల్ బాంబు దాడి జరగడంతో ఆవరణలో పార్క్ చేసిన కారు ధ్వంసమైంది.