తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు కూతురు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. భర్త కుటుంబంపై బెదిరింపులకు పాల్పడవద్దని తన తండ్రికి విజ్ఞప్తి చేశారు.

ఇటీవల పెళ్లి చేసుకున్న తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. అనంతరం తనకు రక్షణ కల్పించాలని బెంగళూరు సిటీ పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. పీకే శేఖర్ బాబు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పీకే శేఖర్ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందాడు. అతని కూతురు జయ కల్యాణి ఒక డాక్టర్. అయితే జయ కల్యాణి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా.. వ్యాపారవేత్త సతీష్ కుమార్‌ను వివాహం చేసుకుంది. 

కర్ణాటకలోని విజయనగర్ జిల్లాలోని హిరేహడగలిలో హాలస్వామి మఠంలో జయ కల్యాణి, సతీష్‌ల వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే జయ కల్యాణి మీడియాకు ఓ వీడియో విడుదల చేసింది. సతీష్, తాను దాదాపు ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా జయ కల్యాణి వీడియోలో పేర్కొన్నారు. తాము పెళ్లి చేసుకోవడానికి ఇళ్లలో నుంచి బయటికొచ్చామని చెప్పారు. తామిద్దరం మేజర్స్ అని.. అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. సతీష్ కుటుంబాన్ని బెదిరించవద్దని జయ కల్యాణి తన తండ్రికి విజ్ఞప్తి చేశారు. తనకు, తన భర్త సతీష్‌కు ముప్పు ఉందనే భయంతో బెంగళూరు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలపారు.

ఇక, జయకళ్యాణికి 24 ఏళ్లు కాగా, సతీష్‌కి 27 ఏళ్లు. జయ కల్యాణి కుటుంబం ఆమెకు వేరే వ్యక్తితో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ.. ఆమె సతీష్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జయ కల్యాణి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత చెన్నైలో జయ కల్యాణి తండ్రి శేఖర్ బాబు.. మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. తన కూతురు కిడ్నాప్‌కు గురైందనే అనుమానం వ్యక్తం చేశారు.

‘ప్రేమ వివాహాలకు మేం మద్దతు ఇవ్వము. అయితే డాక్టర్ కళ్యాణి తన అంగీకారానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి ఇంటి నుంచి వెళ్లిపోయింది. నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపించాం’ అని హాలస్వామి మఠానికి చెందిన అభినవ హలవీరప్పజ్జ స్వామి చెప్పారు.