పెళ్లంటే వేదమంత్రాలు, భాజాభజంత్రీలు, అగ్నిసాక్షిగా జరుగుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం తన తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని సింగనూర్ గ్రామానికి చెందిన దైవమణి కుమారుడు అలెగ్జాండర్.

అతను మయిలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే స్కూలులో పని చేస్తున్న గుణమంగళానికి చెందిన జగదీశ్వరితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లోనూ తెలియజేశారు. దీనికి అంగీకరించిన పెద్దలు సెప్టెంబర్ 2న వివాహానికి నిశ్చయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన అలెగ్జాండర్ తండ్రి దైవమణి మృతిచెందాడు.

నాన్న మరణంతో కృంగిపోయిన అలెగ్జాండర్ తన తండ్రి మృతదేహం ఎదుటే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఇరువురి కుటుంబీకులు అంగీకరించడంతో జగదీశ్వరిని పెళ్లి చేసుకుని తండ్రి పట్ల తన ప్రేమను చూపించాడు.