ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా సంవత్సరాలుగా వారి సంసారం సవ్యంగానే సాగింది. సడెన్ గా ఏమైందో ఏమో.. ఆమెకు అతీంద్రియ శక్తుల పట్ల పిచ్చి పట్టింది. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంది. ఆమె తో కలిసి తన ఇద్దరు కొడుకులను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. ఓ రోజు ఏకంగా తన ఇద్దరు బిడ్డలను బలి ఇవ్వాలని అనుకుంది. అయితే.. ఆ చిన్నారులు తెలివిగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్ నగర్ కు చెందిన రామలింగం(42), రంజిత(32) దంపతులు. వీరికి దీపక్(15), కిషాంత్(6) అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో అతను ఇందుమతి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా వీరుండే ప్రాంతానికి సమీపంలోనే ఉంచాడు.

కాగా.. ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి అప్పుడప్పుడు రంజిత వాళ్ల ఇంటికి వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ధనలక్ష్మితో రంజిత స్నేహం బలపడింది. ఒకరోజు తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు  రామలింగానికి షాక్ ఇచ్చారు. విచిత్రంగా ఆయన కూడా వారి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు.

కన్న కొడుకుల  ఎదురుగానే రామలింగం తన భార్య రంజితకు మరో మహిళ ధనలక్ష్మితో వివాహం జరిపించాడు. అప్పటి నుంచి వారి ప్రవర్తన మరింత వింతగా మారింది. పిల్లలను హింసించడం మొదలుపెట్టారు. అతీంద్రియ శక్తులు వస్తాయంటూ.. తండ్రి రామలింగాన్ని మామ అని పిలవాలని... కొత్తగా తాను పెళ్లాడిన ధనలక్ష్మిని నాన్న అని పిలవాలని రంజిత వేధించడం మొదలుపెట్టింది.

తల్లి వింత ప్రవర్తను పిల్లలు షాకయ్యారు. పిల్లలను స్కూల్ కి కూడా పోనివ్వకుండా ఇంట్లోనే బంధించింది. పిల్లలకు శానిటైజర్ తాగించడం.. ఒంటి నిండా కారం పూసి ఎండలో నిలపెట్టడం లాంటివి చేసేది. ఒక రోజు పథకం ప్రకారం.. పిల్లలను నర బలి కూడా ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు. అయితే.. పిల్లలు తెలివిగా అక్కడి నుంచి పరారయ్యి.. తమ తాత తో అసలు నిజం చెప్పారు. పిల్లల తాత పోలీసులను ఆశ్రయించగా.. వారు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.