ప్రేమతో... తమ మిత్రులకు, బంధువులకు ఆయన విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆయన ప్రేమగా పెట్టిన భోజనాన్ని ఆరగించిన అతిథులు.. చివరకు ఆయనను అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించారు. కేవలం ఆశీర్వచనాలతో సరిపెట్టలేదు... తమకు తోచిన సహాయం చేసి ఆ రైతుని కోటీశ్వరుడిని చేశారు. మీరు చదివింది నిజమే. విందు భోజనానికి వచ్చిన అతిథులు చదివించిన చదివింపులతో ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలుకాలో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... కీరామంగళం తాలుకాలో ఓ సంప్రదాయం ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే.. వారు తమ ఆత్మీయులకు విందు భోజనం ఏర్పాటు చేయాలి. అలా చేస్తే..వారికి భోజనం చేసిన అతిథులు వారి స్థాయిని బట్టి కానుకలు చదివిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. అయితే... గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న కృష్ణ మూర్తి అనే రైతు కూడా రెండు రోజుల క్రితం బంధువులు, మిత్రులకు విందు భోజనం ఏర్పాటు చేశాడు.

తమ ఇంటికి భోజనానికి రావాలని తన ఆత్మీయులందరినీ పిలిచాడు. రూ.15లక్షలు ఖర్చు చేసి వివిధ రకాల వంటలు వండించి అతిథులకు కడుపు నిండా కమ్మని భోజనం పెట్టాడు. విందు ఆరగించిన బంధు, మిత్రులు కృష్ణమూర్తికి కానుకల వర్షం కురించారు. ఆ కానుకలను లెక్క పెట్టగా... కృష్ణమూర్తి ఆనందంలో మునిగితేలాడు. బంధువుల భోజనానికి తాను రూ.15లక్షలు ఖర్చు పెడితే కానుకలతో ఆయనను కోటీశ్వరుడిని చేశారు. మొత్తం రూ.4కోట్లుగా లెక్క తేలింది.

ఆ కానుకలను లెక్క పెట్టడానికి సమీపంలోని బ్యాంకు లోని కరెన్సీ కౌంటింగ్ మిషన్ తెచ్చి మరీ లెక్క పెట్టారు. ఈ తంతంగానికి పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒక్క విందుతో అతని దరిద్రమంతా ఎగిరిపోయిందని విషయం తెలిసినవారంతా అంటున్నారు. ఏది ఏమైనా ఈ సంప్రదాయం చాలా బాగుందని పలువురు మెచ్చుకుంటున్నారు.