తమిళనాడులో సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు కానుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉండటంతో రేపు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. 

పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కేసుల తీవ్రత తగ్గకపోవడంతో స్టాలిన్ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపింది. బస్సులు కూడా ఇవాళ; రేపు మాత్రమే తిరుగుతాయి. ఆదివారం రాత్రి 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మూతపడనున్నాయి. చివరకు కిరాణ షాపులు కూడా తెరచుకోవని ప్రభుత్వం తెలిపింది.

Also Read:కరోనా వైరస్ : దేశంలో పెరుగుతున్న పరీక్షలు, కలవరపెడుతున్న మరణాలు..

మెడికల్ షాపులు, ఆస్పత్రులు, పాలు, మంచి నీటి సరఫరాకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సర్కార్ మినహాయింపు ఇచ్చింది. చివరకు కూరగాయలు, పండ్లు కూడా ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. స్థానిక సంస్థల సహకారంతో రాష్ట్ర ఉద్యానవనశాఖ వాహనాలు చెన్నై నగరంతో పాటు అన్ని జిల్లాల్లోనూ కూరగాయలు, పండ్లను విక్రయించనున్నాయి.