రోజు రోజుకీ సమాజంలో మానవత్వం చచ్చిపోతుందనడానికి ఇదొక ఉదాహరణ. బతికున్నప్పుడు ఎలాగూ కులాలు, మతాలు అని కొట్టుకు చస్తూనే ఉన్నారు. చనిపోయాక కూడా వాటిని పట్టుకొని వేలాడుతున్నవారు ఇంకా ఉన్నారు. దళితుడని  చెప్పి... చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి అగ్రవర్ణాల వారు అంగీకరించలేదు. దీంతో పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలపెట్టారు. ఈ దారుణ సంఘటన  తమిళనాడులో గత కొద్దిరోజుల క్రితం చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మదురైలోని సులాపురానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. దీంతో అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు స్థానిక స్మశాన వాటికకు తరలించారు. కాగా... అక్కడే ఉన్న అగ్రవర్ణాల కు చెందిన కొందరు వ్యక్తులు అందుకు నిరాకరించారు.

ఓవైపు అంత్యక్రియలకు వీరు అంగీకరించడం లేదు. మరోవైపు జోరున వర్షం పడుతోంది. చేసేదేమీ లేక మృతదేహాన్ని ఓ చోటుకు తరలించారు. అక్కడ పెట్రోల్ పోసి తగలపెట్టారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా... వైరల్ గా మారింది. దీంతో స్థానికులు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా... గత కొంతకాలంగా ఆ ప్రాంతంలోని దళితులు ఇదే పరిస్థితిని ఎదుర్కొనడం గమనార్హం.