చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదంపై బుధవారం నాడు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. జయ అన్న కూతురు దీప, కొడుకు దీపక్‌కు ఈ ఆస్తులు చెందుతాయని  హైకోర్టు ప్రకటించింది. ఆస్తులపై పంపకాలపై 8 వారాల్లో బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.

జయలలితకు చెందిన పోయేస్ గార్డెన్ లో బంగ్లా, కొడైకెనాల్‌లో ఎస్టేట్, హైద్రాబాద్ లో ద్రాక్ష తోట రూ.913 కోట్లుగా ఉంటుందని అంచనా.2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐడిఎంకె  ఘన విజయం సాధించింది. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది నెలల్లోనే ఆమె అస్వస్థతకు గురైన రీతిలో అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన ఆమె ఆకస్మాత్తుగా మరణించారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 

జయలలిత మరణించిన తర్వాత జయ నివాసం పోయేస్ గార్డెన్ తనిఖీలు చేసినప్పుడు ఆస్తి పంపకాలు చేసినట్టుగా  ఆధారాలు లేవు. జయ రక్త సంబంధీకులుగా ఆమె అన్న జయకుమార్ కుమార్తె దీప, కొడుకు దీపక్ మాత్రమే ఉన్నారు. అయితే జయతో వారికి సత్సంబంధాలు లేవు. పోయేస్  గార్డెన్ ఇంటికి రాకపోకలు లేనందున ఆస్తులు వివాదంలో చిక్కుకొన్నాయి. 

జయ ఆస్తికి, రాజకీయాల్లో సైతం తామే వారసులమని దీప ప్రకటించింది. గతంలో దీప రాజకీయ పార్టీని ప్రకటించింది. పోయేస్ గార్డెన్ ఇంటిని జయస్మారక మందిరంగా మార్చాలని అన్నాడిఎంకె ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

అన్నాడిఎంకె వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టింది. అంతే కాదు తమిళనాడు రాష్ట్రానికి ఆమె పలు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.