సారాంశం

 పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న  ప్రేమ జంటకు నిండు నూరేళ్లు నిండాయి.  పెళ్లైన మూడు రోజులకే  ఈ జంట హత్యకు గురైంది.  పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడిలో  దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులను దారుణంగా హత్య చేశారు.  ఈ ఘటనపై పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని  తూత్తుకుడి పట్టణంలోని మురుగేశన్ నగర్ కు చెందిన  ప్రేమ జంట మూడు రోజుల క్రితం  పారిపోయింది.  పారిపోయిన ఈ జంట పెళ్లి చేసుకుంది.

మృతులను  వి.మరిసెల్వం, ఎం. కార్తిగ గా పోలీసులు గుర్తించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ జంట  మధ్య  ప్రేమ వ్యవహరం సాగుతుంది.  కోవిల్ పట్టికి చెందిన  మారిసెల్వం కుటుంబం  మురుగేషన్ నగర్ కు మకాం మార్చింది.  కార్తిగ సంపన్న కుటుంబానికి చెందినవాడు. కార్తిగ పేరేంట్స్ కు ఈ విషయం తెలిసింది. మారిసెల్వం, కార్తిగ పెళ్లికి కార్తిగ పేరేంట్స్ ఒప్పుకోలేదు. దీంతో  ఈ ఏడాది అక్టోబర్ 30న  కార్తిగ, మారిసెల్వం పారిపోయారు.  కోవిల్ పట్టి సమీపంలోని ఓ ఆలయంలో  వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత ఈ నెల  2న  ఈ జంట మురుగేషన్ నగర్ కు చేరుకుంది.  గురువారం నాడు సాయంత్రం  ఆరు గంటల సమయంలో  మూడు బైక్ లపై  వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు  ఈ దంపతులున్న ఇంటిలోకి చొరబడి హత్య చేశారు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  దర్యాప్తు చేపట్టారు. మరో వైపు  మృతదేహలను  పోస్టుమార్టం కోసం  తూత్తుకుడి మెడికల్ కాలేజీకి తరలించారు.  తూత్తుకుడి  ఎస్పీ ఎల్ .బాలాజీ శరవణన్, ఇతర పోలీసు అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ జంటను ఎవరు హత్య చేశారనే విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం  ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు  ప్రకటించారు. మృతి చెందిన  వివాహిత  కుటుంబ సభ్యులే ఈ దారుణానికి  పాల్పడినట్టుగా  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.