Asianet News TeluguAsianet News Telugu

ఇక వికలాంగులందరికీ త్వరలో వర్క్ ఫ్రం హోం అవకాశం - తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న వికలాంగులందరూ త్వరలోనే ఇంటి నుంచి పని చేసేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో పలు ఉన్నత స్థాయి కమిటీలు వేశామని చెప్పారు. 

Tamil Nadu CM Stalin's key announcement is that all disabled people will soon have the opportunity to work from home
Author
First Published Dec 4, 2022, 3:56 PM IST

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్. ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న వికలాంగులు (పీడబ్ల్యూడీలు) అందరూ ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేసుకోవచ్చని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. దాని కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాన్ ముధల్వన్ పథకం కింద ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తూ నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందజేస్తోందని తెలిపారు.

పెళ్లి వేడుకకు గెస్ట్‌గా వెళ్లిన మహిళ.. రూ. 20 లక్షల నగలతో పరార్

వికలాంగులకు తగిన ఉపాధి అవకాశాలను గుర్తించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం నిపుణుల, ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని అన్నారు. వికలాంగులు తమ కార్యాలయాల్లో ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా చేసే ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వానికి ఈ కమిటీలు సిఫార్సులు చేస్తాయని అన్నారు. దృష్టి లోపం ఉన్నవారితో పాటు 4,39,315 మంది వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న నెలవారీ రూ.1,000 పింఛన్‌ను 2023 జనవరి 1 నుంచి రూ.1,500కి పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. దీని వల్ల ఏడాదికి రూ.263.58 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అన్నారు.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ వికటించి వ్యక్తి మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం.. ఎక్కడంటే ?

‘‘సామాజిక న్యాయం పునాదిగా ఉన్న ఈ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. వారి కోసం ప్రణాళిక రచిస్తోంది. ’’ అని స్టాలిన్ అన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న అమర్ సేవాసంఘం వ్యవస్థాపకులు రామకృష్ణన్‌ తదితరుల సేవలను, మారియప్పన్‌, జెర్లిన్‌ అనిక తమ అంగవైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణిస్తున్న తీరును సీఎం గుర్తు చేసుకున్నారు.

అనంతరం సీఎం స్టాలిన్ ఐదుగురు వికలాంగులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పలువురు వ్యక్తులకు ప్రశంసా పత్రాలు, బంగారు పతకాలు అందించారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి గీతాజీవన్, ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్, హెచ్ఆర్ అండ్ సీఈ మంత్రి పీకే శేఖర్ బాబు, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేశన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios