Asianet News TeluguAsianet News Telugu

విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చాలి - కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్..

విద్యను ఉమ్మడి నుంచి తొలగించాలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. దానిని కేవలం రాష్ట్ర జాబితాకే పరిమితం చేయాలని అన్నారు. అలా చేస్తే తమ రాష్ట్రం నుంచి నీట్ ను మినహాయిస్తామని తెలిపారు. 
 

Tamil Nadu CM Stalin demands that education should be included in the state list..ISR
Author
First Published Aug 15, 2023, 2:44 PM IST

నీట్ లో ఉత్తీర్ణత సాధించలేదని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న, మరుసటి రోజు తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై తమిళనాడు సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వకపోవడంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో సీఎం స్టాలిన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం తమిళనాడు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందన్నారు.

ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యను తిరిగి రాష్ట్ర జాబితాకు (ఉమ్మడి జాబితా నుండి) తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే నీట్ వంటి పరీక్షలను పూర్తిగా రద్దు చేయవచ్చని తెలిపారు. విద్యను రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలోకి ప్రవేశపెడితేనే పరీక్షను తొలగించగలమని స్టాలిన్ అన్నారు.

‘‘ద్రావిడ మోడల్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని, 'అందరికీ అంతా' అనే నినాదాన్ని భారతదేశం అంతటా విస్తరింపజేయడం కంటే ఆహ్లాదకరమైన విషయం మరొకటి లేదు. అన్నాదురై (డీఎంకే వ్యవస్థాపకుడు), కలైంజ్ఞర్ సమాఖ్య భారత వ్యవస్థలో రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలని చెప్పారు.’’ అని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు. 

కాగా.. ఆగస్టు 12వ తేదీన జగదీశ్వరన్ (19) అనే విద్యార్థి నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వారి మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రపతి ముర్ముకు ఒక లేఖ రాశారు. తమ మా రాష్ట్రంలో నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 16 కు పెరిగిందని ఆయన లేఖలో ఆవేదన వ్యక్త ం చేశారు. నీట్ నుంచి మినహాయింపు ఇచ్చే బిల్లుకు ఆమోదం తెలిపి + 2 (ఇంటర్) మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు జరిపి ఉంటే ఈ దుర్ఘటనలను కచ్చితంగా నివారించేవారన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ బిల్లు 2021కు ఆమోదం తెలపడంలో జాప్యమే ఈ దురదృష్టకర పరిణామాలకు కారణమని సీఎం స్టాలిన్ ఆరోపించారు. 

ఏమిటీ రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు ? 

మన భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు, బాధ్యతలను పంపిణీ చేస్తూ మూడు జాబితాలను రూపొందించింది. అవే ప్రస్తుతం ఏడో షెడ్యూల్ ఉన్న కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధులు, బాధ్యతలు కేటాయించారు. మొత్తంగా కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 61 అంశాలు, అయితే ఉమ్మడి జాబితాలో 52 అంశాలను చేర్చారు. 

ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి. ఈ అంశాలపై చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంట్ కు, అలాగే రాష్ట్రాల శాసన సభలకు ఉంటుంది. అయితే ప్రస్తుతం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అందుకే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విద్యను కేవలం రాష్ట్ర జాబితాకే పరిమితం చేయాలని కోరుతున్నారు. ఒక వేళ విద్య రాష్ట్ర జాబితాలోకి చేరితే దానిపై విస్తృత అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే వస్తాయి. దీంతో డీఎంకే ప్రభుత్వం నీట్ ను తమిళనాడు నుంచి మినహాయించే చట్టాన్ని ఆమోదించవచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios