కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తుంది. తమిళనాడులో ఈ వైరస్ కరాళనృత్యం చేస్తున్న నేపథ్యంలో అక్కడ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. 

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రైవేట్ సెక్రటరీ నిన్న రాత్రి మరణించినట్టు తెలుస్తుంది. ఉద్యోగుల క్వార్టర్స్ లో నివాసముంటున్న ఈయనను అనేక ఆసుపత్రులను తిప్పారు. చివరకు ప్రైవేట్ ఆసుపత్రిలో అతను మరణించడం జరిగింది. 

ఇకపోతే... తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా సోకి ఆయన  ఆరోగ్యం క్షీణించి గత బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా... తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 4 జిల్లాల్లో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

రాజధాని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టులో ఈ నెల 19 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమిళనాడులో కరోనా కేసులు 45 వేలకు చేరువయ్యాయి.

ఒక్కరోజులో దాదాపు 2,000 కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య 44,661కి చేరింది. వీరిలో 19,676 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 24587 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకు 435 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

లాక్‌డౌన్ దృష్ట్యా ఈ నాలుగు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ప్రజలను నిత్యావసరాలకు అనుమతిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

హోటళ్లు, రెస్టారెంట్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. అలాగే ఈ నాలుగు జిల్లాల్లో ప్రజా రవాణాపై నిషేధం ఉంటుందని పేర్కొంది. 33 శాతం ఉద్యోగులతో ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలు సాగుతాయని తెలిపింది.