ఇద్దరు హిజ్రాలను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య  చేశారు. వారిని చంపేసి గోనెసంచిలో కట్టి.. బావిలో పడేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. ఆ ఇద్దరు హిజ్రాలతో పాటు మరో వ్యక్తిని కూడా చంపేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో హిజ్రాల నివాస ప్రాంతం ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న హిజ్రాలు భవాని, అనుష్క ఆమె భర్త మురుగన్‌ గురువారం నుంచి కనిపించలేదు. వారి కోసం సహ హిజ్రాలు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సంఘటన గురించి పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.


వారు ఇచ్చిన సమాచారం మేరకు పాళయంకోట ఫోర్‌ వే రోడ్డు సమీపంలో ఉన్న బావిలో తేలుతున్న గోనె సంచులను గుర్తించారు. వాటిని బయటకు తీసి చూడగా...  ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనిపించకుండా పోయిన హిజ్రాలు మృతదేహాలుగా గుర్తించారు. దీంతో సహ హిజ్రాలు పెద్ద సంఖ్యలో సూత్తమల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి, హంతకులను పట్టుకోవాల్సిందిగా ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.