తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ మహిళా నాయకురాలితో ఆ పార్టీ నేత రాఘవన్ వీడియో కాల్  కలకలం రేపుతోంది. మహిళతో అసభ్య వీడియో కాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆ పార్టీ నేత రవిచంద్రన్., ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రాఘవన్ పార్టీ పదవికి రాజీనామా చేశారు.


చెన్నై: తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాఘవన్ రాజీనామా చేశారు. రాఘవన్ కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ మహిళా కార్యకర్తతో రాఘవన్ కు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. అదే పార్టీకి చెందిన రవిచంద్రన్ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ ఆరోపణలను రాఘవన్ ఖండించారు. ఈ విషయమై న్యాయపరమైన చర్యలు తీసుకొంటానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వీడియోలో రాఘవన్ అర్ధనగ్నంగా ఓ మహిళా నేతతో అశ్లీలంగా మాట్లాడారని రవిచంద్రన్ ఆరోపించారు.

తమిళనాడు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తనతో ఉన్నవారికి తాను ఎలాంటి వాడినో తెలుసునని ఆయన చెప్పారు. 30 ఏళ్లుగా ఎలాంటి స్వార్ధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో గురించి తాను తెలుసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు. తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని రాఘవన్ అభిప్రాయపడ్డారు.

యూట్యూబ్ లో వీడియోను విడుదల చేసిన రవిచంద్రన్ ఈ విషయమై స్పందించారు. పార్టీకి చెందిన 15 మంది నేతల ఆడియో, వీడియోలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. సరైన సమయంలో వాటిని విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

బలవంతపు సెక్స్, లైంగిక దోపిడీ ఆరోపణల నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్ ఆలోచన వచ్చిందని రవిచంద్రన్ చెప్పారు. ఇలాంటి నేతల నుండి పార్టీని ప్రక్షాళన చేసేందుకే తాను ఈ కార్యక్రమం ప్రారంభించినట్టుగా చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ విషయమై రవిచంద్రన్ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించారు. ఈ రకమైన పద్దతి ఆమోదయోగ్యం కాదన్నారు.ఈ ఆరోపణలను తమ పార్టీ సీరియస్ గా తీసుకొంటుందని అన్నామలై చెప్పారు. 

తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలార్కోడి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను అధ్యయనం చేయనున్నట్టుగా చెప్పారు. ఈ ఘటనలో నిందితులుగా తేలినవారిపై చర్యలు తీసుకొంటామని అన్నామలై చెప్పారు.తమ పార్టీలో మహిళలను అత్యంత గౌరవం చూస్తారని అన్నామలై చెప్పారు.