తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలైపై పోలీసు కేసు నమోదైంది. తనపై కేసు నమోదు కావడంపై స్పందించిన అన్నామలై.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలైపై పోలీసు కేసు నమోదైంది. రాష్ట్రంలో వలస కార్మికులపై దాడులకు పాల్పడుతున్నారనే పుకార్ల నేపథ్యంలో హింసను ప్రేరేపించడం, సముహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలకు సబంధించి అన్నామలైపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బీజేపీ బీహార్ ట్విట్టర్ అకౌంట్ హోల్డర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక, ఇదే అభియోగంపై పోలీసులు నిన్న బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తనపై కేసు నమోదు కావడంపై అన్నామలై స్పందించారు. ఉత్తర భారత సోదరులపై 7 దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారాన్ని బయటపెట్టినందుకు డీఎంకే తనపై కేసులు పెట్టిందని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. వారు మాట్లాడిన వీడియో ఇక్కడ ఉందని.. ఇదే విషయాన్ని నిన్న తన పత్రికా ప్రకటనలో ప్రస్తావించినట్టుగా చెప్పారు. ఫాసిస్ట్ డీఎంకే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. ఒక సామాన్యుడిగా తాను ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నానని.. వీలైతే తనపై చేయి వేయండని అన్నారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతున్న వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.
ఇక, తమిళనాడులో వలస కూలీలను క్రూరంగా కొడుతున్నారంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో తీవ్ర కలకలం రేగింది. తమిళనాడు, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సందేశాలను వ్యాప్తి చేయకుండా హెచ్చరికలు జారీ చేశాయి. బీహారీ వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరగడం లేదని తమిళనాడు పోలీసులు కూడా స్పష్టం చేశారు.
వలస కార్మికుల అంశానికి సంబంధించి నిన్న ఒక్క ప్రకటన విడుదల చేసిన అన్నామలై.. తమిళనాడులో వలస కార్మికులు క్షేమంగా ఉన్నారని, అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, దాని కూటమి పార్టీ నాయకులు వారిపై ద్వేషానికి కారణమని చెప్పారు. రాష్ట్రంలో బీహార్‌కు చెందిన ప్రజలపై దాడిపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ‘‘తమిళనాడులో వలస కార్మికులపై జరుగుతున్న దాడుల గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందడం నిరుత్సాహపరుస్తుంది. మేము తమిళ ప్రజలుగా "ప్రపంచం ఒక్కటే" అనే భావనను విశ్వసిస్తాము. మా ఉత్తరాది భారతీయ సోదరులకు వ్యతిరేకంగా వేర్పాటువాదం, నీచమైన ద్వేషాన్ని ఆమోదించము’’ అని అన్నామలై వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
అదే సమయంలో డీఎంకే ప్రభుత్వంపై అన్నామలై విరుచుకుపడ్డారు. “ఉత్తర భారతీయులపై డీఎంకే ఎంపీలు నీచమైన వ్యాఖ్యలు చేయడం.. డీఎంకే మంత్రి వారిని పానీపూరీ వాలా అని అనడం.. వారి కూటమి భాగస్వాములు చేస్తున్న కామెంట్స్ ఈ రోజు మనం చూస్తున్నదానికి కారణమైంది’’ అని అన్నామలై పేర్కొన్నారు.
అయితే వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయనే పుకార్ల నేపథ్యంలో.. చాలా మంది కార్మికులు పనికి దూరంగా ఉన్నారు. దీంతో వలస కార్మికులపై ఆధారపడిన తమిళనాడులోని పరిశ్రమలపై ప్రభావం పడింది. ఈ భయాందోళనలను గుర్తించి తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు ఒక ప్రకటన విడుదల చేశారు,. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వీడియో ఫాల్స్ అని పేర్కొన్నారు.
“తమిళనాడులో వలస కార్మికులపై దాడి జరిగిందని బీహార్‌లో ఎవరో తప్పుడు వీడియోలను పోస్ట్ చేశారు. రెండు వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. ఈ సంఘటనలు తిరుప్పూర్, కోయంబత్తూరులో ఇంతకు ముందు తేదీలో జరిగినందున రెండూ అబద్ధం. అందులో ఒకటి బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికుల రెండు సమూహాల మధ్య ఘర్షణ. మరొకటి కోయంబత్తూరులో స్థానిక నివాసితుల మధ్య ఘర్షణకు సంబంధించింది. ఈ వదంతులతో భయాందోళనల సృష్టించడం వెనుక ఉన్న వ్యక్తులను విడిచిపెట్టబోం’’ అని డీజీపీ తెలిపారు.
