ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2021 మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడి రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారిపోయింది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ల మధ్య మాటల యుద్ధం తార స్థాయిలో నడుస్తుంది. 

ఇక అటు జయలలిత, ఇటు కరుణానిధిలు ఇద్దరు కూడా కాలం చేయడంతో అక్కడ ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఉపయోగించుకొని రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు తమిళ హీరోలు పోటీ పడుతున్నారు. 

ఇప్పటికే కమలహాసన్ పార్టీని స్థాపించాడు. రజినీకాంత్ త్వరలో అంటున్నాడు. ఇద్దరం కలిసి పోటీ చేస్తాం అని వారు చెబుతున్నారు. మరోపక్క డీఎంకే నెమో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రప్రయత్నాలను చేస్తుంది. 

ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్-డీఎంకే లు ఒక పక్షంగా, బీజేపీ-అన్నాడీఎంకే ఒక పక్షంగా ఉన్నాయి. డీఎంకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. ఒక నాలుగు నెలల ముందు నుండే ప్రశాంత్ కిషోర్ తన పనిని ప్రారంభించేసాడు కూడా. 

ఇక తాజాగా తమిళనాట మరో హీరో రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కాలంలో ఆయనపైన ఐటీ దాడులు కూడా జరగడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అయింది. ఆయన మరెవరో కాదు తమిళ హీరో విజయ్. 

విజయ్ ఇటీవలి కాలంలో నటించిన సినిమాల్లో ఒకింత బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతున్న సీన్స్ కొన్ని ఉన్నాయి. వాటి వల్లనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం హీరో విజయ్ పై దాడులు చేపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

ఇక ఈ ఆరోపణలను పక్కన పెడితే... విజయ్ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆయనను తమవైపు తిప్పుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అళగిరి విజయ్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసాడు. 

విజయ్ ని తాము పార్టీలోకి ఆహ్వానించలేదని... విజయ్ వస్తానంటే పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. అంతే కాకుండా విజయ్ కావాలనుకుంటే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చేస్తామని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో చూడాలి విజయ్ ఎటువైపు మొగ్గు చూపుతాడో.