ప్రముఖ టీవీ రియాల్టీ షో ద్వారా పాపులారిటీ సాధించిన ఓ భామ.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది. తమిళ బిగ్ బాస్-2లో పాల్గొని.. పాపులారిటీ సంపాదించుకుంది నిత్య. ఆమె కమెడియన్, టీవీ యాంకర్ బాలాజీ భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ బిగ్ బాస్ షోలో కలిసి పాల్గొన్నారు.

ఈ షోకి రాకముందే.. ఈ ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగారు. తర్వాత బిగ్ బాస్  షోలోనూ ఒకరినొకరు తిట్టుకుంటూ మరింత పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్‌ గేమ్‌ షో నుంచి బయటకు వచ్చిన తరువాత నిత్య సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

ఇటీవల ముంబైలో ప్రారంభించిన నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీకి నిత్య రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైంది. బుధవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ అధ్యక్షురాలిగా నిత్య పేరును అధికారికంగా ప్రకటించారు.