Asianet News TeluguAsianet News Telugu

తాలిబాన్ హింస తప్పదా? చేతులు నరకాల్సిందే.. చంపడమూ తప్పదంటున్న తాలిబాన్ నేత

ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలుగజేస్తున్నాయి. తాజాగా, ఓ తాలిబాన్ నేత గతంలో తాము అమలు చేసినట్టే ఇప్పుడూ కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలిపారు. చేతులు నరకడం చాలా అవసరమని, చంపడమూ తప్పదని అన్నారు. సెక్యూరిటీ కోసం చేతులు నరికేయడం సత్ఫలితాలనిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

taliban will implement cutting off hands, executions as usual says a leader
Author
New Delhi, First Published Sep 24, 2021, 3:26 PM IST

న్యూఢిల్లీ: తాము మానవ హక్కులను పరిరక్షిస్తామని, మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించిన తాలిబాన్లు మెల్లమెల్లగా తనదైన వికృత రూపాన్ని వెల్లడిస్తూ వస్తున్నది. మహిళలు ఉద్యోగాలు చేయవద్దని, ఇంటికే పరిమితం కావాలని ఆదేశించడం, వారు పిల్లలు కంటే చాలని, మంత్రి బాధ్యతలు నిర్వహించడం వారితో సాధ్యం కాదని తాలిబాన్ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. తరగతి గదుల్లో యువకులను, యువతులను వేరుచేసే కర్టెయిన్‌ల మధ్య విద్య అభ్యసించడం, జర్నలిస్టులపై దాడులు వారి మాటలకు, చేతలకు పొంతన లేదని స్పష్టపరుస్తున్నాయి. కానీ, అంతో ఇంతో సంస్కరించబడిందన్న వాదనలు వినిపిస్తున్నా.. అవన్నీ వట్టివేనని తాజాగా ఓ తాలిబాన్ నేత వ్యాఖ్యలు రూఢీ  చేస్తున్నాయి.

గత తాలిబాన్ ప్రభుత్వ కర్కశానికి పరాకాష్టగా అప్పటి శిక్షాస్మృతులను తెలిపేవారు. స్టేడియాలు, బహిరంగ ప్రదేశాల్లో తప్పు చేశారని దోషులను కాల్చి చంపడం, చేతులు, కాళ్లు నరికేయడం వంటి అనాగరిక శిక్షలను అమలు చేశారు. కనీసం ఇలాంటి అనాగరిక శిక్షలకైనా మినహాయింపు ఉంటుందని భావించారు. కానీ, తాలిబాన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

‘స్టేడియాల్లో మేము వేసే శిక్షలపై మమ్ములను విమర్శించేవారు. కానీ, వారి శిక్షాస్మృతుల గురించి ఎప్పుడు అడగలేదు. మా శిక్షలు ఎలా ఉండాలో మాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మేం ఇస్లాం అనుసరిస్తాం. మా చట్టాలు ఖురాన్‌ను అనుసరించే ఉంటాయి’ అని అన్నారు. ‘సెక్యూరిటీ కోసం చేతులు నరికేయడం చాలా అవసరం. ఇలాంటి శిక్షలే ఆశించిన ఫలితాలను ఇస్తాయి’ అని తెలిపారు. అయితే, ఈ శిక్షలను బహిరంగంగా అమలు చేయాలా? లేక గుట్టుగా చేయాలా? అనే విషయంపై యోచనలు జరుగుతున్నాయని వివరించారు. క్యాబినెట్ ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నదని, ఇందుకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.

తాలిబాన్ గత ప్రభుత్వ పాలనలో జస్టిస్ మినిస్టర్‌గా ముల్లా నూరుద్దీన్ తురాబీ వ్యవహరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios