Asianet News TeluguAsianet News Telugu

తాలిబన్ల అధీనంలోకి భారత ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్

అఫ్ఘాన్‌లో 65శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్ తాజాగా, భారత్‌కు చెందిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్‌నూ అధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. 2019లో భారత ప్రభుత్వం అఫ్ఘాన్ మిలిటరీ దళాలకు ఈ చాపర్‌ను బహూకరించింది. కాండూజ్‌లో ఈ చాపర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 

taliban seizes india gifted attack helicopter mi-24
Author
New Delhi, First Published Aug 12, 2021, 2:07 PM IST

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్‌ నుంచి యూఎస్, నాటో దళాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుంచి తాలిబన్ల దాడులు తీవ్రమయ్యాయి. అష్రఫ్ ఘనీ ప్రభుత్వ ఉనికిని ప్రమాదంలోకి నెడుతూ వేగంగా నగరాలను హస్తగతం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సుమారు 65శాతం దేశ భూభాగం తాలిబన్ల చేతిలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే భారత్ సహా పలుదేశాల్లో ఆయా ప్రాంతాల్లోని తమ పౌరులను, సిబ్బందిని వెనక్కి రప్పించుకుంటున్నాయి. కొన్ని చోట్ల తాలిబన్ల దాడి తీవ్రంగా మారడంతో అధికారులు, పోలీసులూ పరారవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాలిబన్ల అదుపులో ఉన్న కాండుజ్ నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫొటోల్లో ఆ దేశ మిలిటరీ దళాలకు భారత్ బహూకరించిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్ చిత్రాలు, వీడియోలు కనిపించాయి. ఈ హెలికాప్టర్ పక్కన తాలిబన్లు నిలబడి ఉన్న ఫొటోలూ వైరల్ అవుతున్నాయి. ఈ హెలికాప్టర్ తాలిబన్ల అధీనంలోకి వెళ్లినట్టు కొన్ని వర్గాలు వెల్లడించాయి.

తాలిబన్లు వినియోగించలేరు..
ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటికీ దానిని వినియోగించలేరని తెలుస్తున్నది. ట్విట్టర్‌లో పోస్టు అయిన ఓ వీడియోలో హెలికాప్టర్‌ రోటర్ బ్లేడ్స్ అమర్చి లేవు. తాలిబన్లు ఈ చాపర్‌ను వినియోగించకుండా అఫ్ఘాన్ ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా వాటిని తొలిగించి ఉంటుందని సమాచారం.

2015లో అఫ్ఘాన్ ప్రభుత్వానికి భారత్ నాలుగు అటాక్ హెలికాప్టర్లను బహూకరించింది. 2019లో మరోసారి ఇలాగే ఎంఐ-24ను, మరో మూడు చీతా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను గిఫ్ట్‌గా అందించింది. 2019లో భారత్ ఇచ్చిన ఎంఐ-24 అటాక్ చాపరే నేడు తాలిబన్ల అధీనంలోకి చేరింది.

స్వీయరక్షణలో ప్రభుత్వం
తాలిబన్ల దూకుడుకు కళ్లెం వేయడానికి అఫ్ఘాన్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వ బలగాలతో పాటు ప్రస్తుతం అదే దేశంలోనున్న యూఎస్, నాటో బలగాలపై ఆధారపడుతున్నారు. వీలైనంత వరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాదాపు 65శాతం భూభాగాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దేశ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు చాలా దూరంలోనే ఉన్నప్పటికీ సమీపించడానికి మరెంతో కాలం పట్టదన్న అంచనాలున్నాయి. దీనికి తోడు ఈ నెలాఖరుతో యూఎస్, నాటో బలగాలు పూర్తిగా వెనుదిరగడం ఘనీని కలవరపెట్టే అంశంగా మారింది.

డొనాల్డ్ ట్రంప్ హయాంలో అఫ్గాన్ నుంచి మిలిటరీ దళాల ఉపసంహరణపై స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పావులు కదిపారు. తమ పౌరుల ప్రాణాలను ఇంకా కోల్పోలేమని చెబుతూ ఆగస్టులోపు బలగాలను వెనక్కి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. దీంతో తాలిబన్, అఫ్ఘాన్ ప్రభుత్వం మధ్యలో దశాబ్దాల క్రితం జరిగిన యుద్ధం మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.

Follow Us:
Download App:
  • android
  • ios