లంచం తీసుకొని దొంగలను వదిలిపెడుతున్నారు.. రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన పోలీసు.. వీడియో వైరల్
తాను అరెస్టు చేసి తీసుకొచ్చిన దొంగలను తన సహోద్యోగులు లంచం తీసుకొని వదిలిపెడుతున్నారని ఓ పోలీసు ఆరోపించారు. ఈ విషయంలో అతడు హైవేపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ నిరసనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ పోలీసు.. తన సహోద్యోగుల అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హైవే రోడ్డుపై పడ్డుకొని తన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పంజాబ్ లోని జలంధర్ లో చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన అసాధారణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివరాలు ఇలా ఉన్నాయి. నిరసన తెలిపిన పోలీసు భోగ్ పూర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. అయితే అతడు కొంత కాలం కిందట కేసులో దొంగను అదుపులోకి తీసుకున్నాడు. స్టేషన్ కు తీసుకెళ్లి, సెల్ లో ఉంచాడు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ నిందితుడు కనిపించకుండా పోయాడు. ఆ దొంగ ఎక్కడికి వెళ్లాడని ఆ పోలీసు ఇతర పోలీసులను అడిగాడు. దీంతో వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.
దీంతో లంచం తీసుకొని మిగితా పోలీసులు ఆ దొంగను వదిలిపెట్టారని ఆరోపిస్తూ ఆ పోలీసు జలంధర్ లోని పఠాన్ కోట్ హైవేపై వచ్చి నిరసన తెలిపాడు. హైవేను తాడుతో దిగ్బంధించారు. రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భోగ్ పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సుఖ్ జిత్ సింగ్ అక్కడి చేరుకున్నారు. నిరసన ఆపేసి, ట్రాఫిక్ క్లియర్ చేయాలని అతడిని ఆదేశించారు. కానీ అతడు వినకపోవడంతో ఒక సారి కాలుతో తన్నడం కూడా వీడియోలో కనిపిస్తోంది.
ఈ సందర్భంగా నిరసన తెలిపే పోలీసు ‘‘నేను దొంగలను పట్టుకుంటాను. కానీ నా పోలీస్ స్టేషన్ లోని ఇతర పోలీసులు డబ్బులు తీసుకొని వారిని విడిచిపెడుతారు’’ అని ఆరోపించాడు. అయితే దీనిని అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ ఘటనపై భోగ్ పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సుఖ్ జిత్ సింగ్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఆ పోలీసు ఓ యువకుడిని అరెస్టు చేసి తీసుకొచ్చాడని తెలిపారు. అయితే ఆ కేసులో నిందితుడు కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని చెప్పారు. కోర్టు అతడికి బెయిల్ ఇచ్చిందని, దీంతో విడుదలై వెళ్లిపోయాడని తెలిపారు. నిరసన తెలిపే పోలీసును తాను తన్నలేదని చెప్పారు.