కరోనా ఎఫెక్ట్: తబ్లిగీ చీఫ్ మహమ్మద్ సాద్ కాంద్వలీపై నేరపూరిత హత్య కేసు
దేశంలో లాక్ డౌన్ నిబంధనలు ఉన్నా కూడ వాటిని తుంగలో తొక్కి నిజాముద్దీన్ లో మత పరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా పలువురు కరోనా బారిన పడ్డారని పోలీసులు పేర్కొన్నారు.
మౌలానా స్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత అతడిని అరెస్ట్ చేయాలా వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకొనే చాన్స్ ఉందని తెలుస్తోంది.మౌలానా సాద్ ఈ ఏడాది మార్చి 28వ తేదీన కన్పించాడు. ఆ తర్వాత ఆయన ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. తాను ఒంటరిగా ఉన్నానని ఆ సందేశంలో పేర్కొన్నాడు.
మౌలానాతో పాటు ఇతరులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లోని 304 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
గతంలో సాద్ తో పాటు మరికొందరిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఐపీసీ 304 సెక్షన్ ను చేర్చడం ద్వారా పోలీస్ స్టేషన్ నుండి వీరు బెయిల్ పొందలేరు.
సాద్ కు ఇప్పటికే దర్యాప్తు అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో 26 ప్రశ్నలకు అడిగారు. సాద్ నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించి 26 ప్రశ్నలను అడిగారు పోలీసులు.
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన మర్కజ్ లో మత సమ్మేళనం నిర్వహించడంపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
also read:ఇండియాలో 12,380 కరోనా కేసులు: మరణాల సంఖ్య 414
మర్కజ్ లో జరిగిన సమావేశానికి హాజరైన తమ స్వంత గ్రామాలకు వెళ్లినవారిలో కొందరు కరోనాతో మృతి చెందారు. వందలాది మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు ప్రకటించారు.
మౌలానాతో పాటు మరో 18 మందిని దర్యాప్తులో పాల్గొనాల్సిందిగా పోలీసులు కోరారు.సుమారు రెండువేల మంది తబ్లిగీ జమాత్ సభ్యులపై అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కొందరు విదేశీయులు కూడ ఉన్నారు.
పోలీసులు పంపిన ప్రశ్నలకు సంబంధించి కొన్నింటికి సాద్ సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. మరికొన్నింటికి సంబంధించి ఇంకా సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.మర్కజ్ కు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయమై కూడ ఢిల్లీ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.