నీకు దెయ్యం పట్టింది.. నేను పోగొడతానని నమ్మించి ఓ స్వామిజీ.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మైసూరు జిల్లా చిల్కుంద గ్రామలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... చిల్కుంద గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆ యువతికి దెయ్యం పట్టిందని భావించిన బంధువు... సమీపంలోని హణసూరు లాల్‌బన్ బజారుకు చెందిన జబీవుల్లా అనే స్వామిజీ వద్దకు తీసుకెళ్ళాడు.

సదరు యువతిని స్వామిజీ పరీక్షించి.,. ఆమెపై మంత్రాలు ప్రయోగించారని, దెయ్యం పట్టిందని చెప్పాడు. పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో బంధువు ఆ యువతిని దర్గా వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ క్రమంలో... ‘యువతి వద్ద ఉంటే నీకూ దెయ్యం పడుతుంది’ అని చెప్పి ఆమెను తీసుకొచ్చిన బంధువును స్వామిజీ దూరంగా పంపించాడు.

అనంతరం యువతికి స్నానం చేయించాలనే నెపంతో తీసుకెళ్లి జబీవుల్లా ఆమెపై అత్యాచారం చేశాడు. ఊహించని ఈ ఘటనతో యువతి బెదిరిపోయి తన తండ్రికి జరిగినదంతా చెప్పింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జబీవుల్లాను విచారిస్తున్నారు.