పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హీట్ పెరిగింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానన్న మమత కామెంట్స్‌తో ఇప్పుడు అందరి దృష్టి ఆ సీట్‌పై పడింది. అటు టీఎంసీ మాజీ అనుచరుడు, ఇటు బెంగాల్ సీఎం.. దీంతో నందిగ్రామ్ పోరు దేశంలో హాట్ టాపిక్‌గా మారింది.

బెంగాల్ బేటీని అంటూ మమత చెబుతుంటే.. దీదీని ఓడిస్తానంటూ శపథం చేస్తున్నాడు సువేందు అధికారి. తన అడ్డాలో మమత విక్టరీ ఈజీ కాదని అంటున్నాడు. తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఈ ప్రాంతానికి వుంది.

ఎకనమిక్ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా నిలిచింది తృణమూల్ కాంగ్రెస్. అదే 2011లో టీఎంసీని అధికారంలో  కూర్చోబెట్టింది. నాటి రైతుల ఆందోళనలకు టీఎంసీ అండగా నిలిచింది.

మమత అనుచరుడిగా ఇక్కడి రైతాంగా పోరాటాన్ని నాయకుడిగా నడిపించింది మాత్రం సువేంధు అధికారే. మా మట్టి... మా మనుషులు  అంటూ దీదీతో కలిసి సువేంధు చేసిన పోరాటం అక్కడ ఆయన్ను తిరుగులేని నేతగా తయారు చేసింది.

2009లో ఉప ఎన్నికలో గెలిచినప్పటి నుంచి సువేందు అక్కడ ఓడిపోలేదు. తర్వాత ఎన్నికల్లోనూ ఆయన మెజారిటీ పెరుగుతూనే వస్తోంది. ఈ పోరాటం తర్వాతే దీదీకి దగ్గరయ్యాడు సువేందు.

అయితే సువేందు ఇప్పుడు బీజేపీలో చేరాడు. భారతీయ జనతా పార్టీ సైతం ఆయను ప్రమోట్ చేస్తోంది. ఎలాగైనా బెంగాల్‌ను దక్కించుకోవాలని భావిస్తోన్న కమల నాథులు.. సువేందును ప్రోత్సహిస్తున్నారు.

మమతను చిత్తుగా ఓడిస్తానంటూ సువేందు కామెంట్ చేయడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. ఇన్నాళ్లు తన వెంటే వుండి పార్టీ మారిన అందరికీ గుణపాఠం చెబుతానంటున్నారు.

అక్కడ గెలిచేందుకు మమత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తాను బెంగాలీ బిడ్డనని.. నందిగ్రామ్ అంటే ఇష్టమంటూ చెబుతున్నారు. జనవరిలోనే ఇక్కడ పోటీ చేస్తానని ఆమె లీకులు ఇవ్వడంతో నందిగ్రామ్‌లో టీఎంసీ శ్రేణులు సైలెంట్‌గా పావులు కదుపుతున్నాయి.

అటు సువేందు సైతం ఏమాత్రం తగ్గడం లేదు. మమతను 50 వేల మెజారిటీతో ఓడిస్తానని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అటు బీజేపీ హైకమాండ్ సైతం దీదీపై సువేందును ధించాలని భావిస్తోంది. మొత్తంగా నందిగ్రామ్ సమరం రసవత్తరంగా మారింది.