భర్తపై అనుమానం.. వేడినీళ్లలో కారం కలిపి గుమ్మరించిన భార్య...
భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య అతనిమీద కారంకలిపిన వేడినీళ్లు పోసింది. పెళ్లైన 11నెలలకే ఈ ఘటన జరిగింది. దీనిమీద కేసు నమోదయ్యింది.

ఉడిపి : తన భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కారంపొడి కలిపిన వేడినీళ్లను అతనిపై చల్లింది. దీనిమీద కర్ణాటకలోని ఉడిపి.. కాపు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.గాయపడిన వ్యక్తి ఇన్నా గ్రామంలోని మాడ్మాన్ నివాసి మహ్మద్ ఆసిఫ్ (22)గా సమాచారం.
ప్రస్తుతం అతను ఉడిపి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అఫ్రిన్ తో ఆసిఫ్ కు 11 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత, అఫ్రీన్ నెలన్నరపాటు మాత్రమే అత్తగారింట్లో ఉంది. ఆ తరువాత తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తరువాత భార్య దగ్గరికి వచ్చేసిన ఆసిఫ్ గత తొమ్మిది నెలలుగా తన భార్య ఇంట్లోనే ఉంటున్నాడు.
తేనెటీగల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు...
ఈ క్రమంలోనే అఫ్రీన్ కు భర్త మీద అనుమానం మొదలయ్యింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సెప్టెంబరు 17న ఆసిఫ్ స్నానం చేస్తుండగా ఈ ఘటన వెలుగు చూసింది. అతను స్నానం చేస్తుంటే.. భార్య వెళ్లి తలుపు తట్టింది. ఆసిఫ్ తలుపుతీయగానే అతనిపై కారం పొడి కలిపిన వేడి నీళ్లను గుమ్మరించింది.
ఆ తరువాత మంట, వేడినీళ్ల బాధతో అరుస్తున్న ఆసిఫ్ ను అఫ్రీన్, ఆమె బంధువులు కలిసి ఒక గదిలో బంధించారు. అనంతరం విషయం తెలుసుకున్న అతని బంధువు ఒకరు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. కాపు పోలీసులు పలు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.