Asianet News TeluguAsianet News Telugu

2024 ఎన్నికలు: రాజస్తాన్ సీఎం ఎవరు? గెహ్లటా.. పైలటా? సోనియా గాంధీ నిర్ణయం ఎవరి వైపు?

కాంగ్రెస్ చీఫ్ ఎన్నికతోపాటు రాజస్తాన్ రాజకీయాలపైనా ఆసక్తి నెలకొంది. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికైతే.. రాజస్తాన్ సీఎంగా సచిన్ పైలట్ ఉంటారని చాలా మంది భావించారు. కానీ, అనూహ్యమైన గెహ్లాట్ అనుకూల వర్గ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఈ చిత్రాన్ని మొత్తంగా మార్చేసింది. ఇప్పుడు సీఎం నిర్ణయం సోనియా గాంధీ చేతిలో ఉన్నది. ఆమె మరో ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తారు.
 

suspense on rajasthan CM post.. sonia gandhi to decide sachin pilot or ashok gehlo
Author
First Published Sep 29, 2022, 7:07 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికతోపాటు రాజస్తాన్‌లోనూ రాజకీయం జోరందుకుంది. అశోక్ గెహ్లాట్ అనుయాయులు తిరుగుబాటు చేయడంతో రాజస్తాన్‌లో కాంగ్రెస్ చీఫ్ కంటే కూడా రాష్ట్ర భవిష్యత్‌ ఆసక్తికరంగా మారింది. ఈ చర్చలో సీఎం సీటు ప్రధానంగా ఉన్నది. రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతారా? లేక ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ అధిష్టానం చాన్స్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ రోజు సోనియా గాంధీతో సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ రెండు కీలక ప్రకటనలు చేశారు. అందులో ఒకటి తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయను అని వెల్లడించారు. మరో విషయం రాజస్తాన్ సీఎం పీఠంపై మాట్లాడారు. రాజస్తాన్ సీఎంగా కొనసాగుతారా? అని అడగ్గా.. ఆ విషయాన్ని సోనియా గాంధీ అప్పజెప్పానని వివరించారు. అంటే.. ఆ నిర్ణయం సోనియా గాంధీ చేతిలో ఉన్నదని స్పష్టం చేశారు.

రాజస్తాన్‌లో తనకు అనుయాయులైన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం తామందరినీ కంపించిందని ఆయన వివరించారు. ఇందుకు తాను బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పానని, అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నా అని తెలిపారు. సీఎం విషయంపైనా నిర్ణయం సోనియాకే వదిలిపెట్టినట్టు తెలిపారు.

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మాకెన్ మాట్లాడుతూ.. రాజస్తాన్ సీఎంగా ఎవరు ఉంటారనేది ఒకటి లేదా రెండు రోజుల్లో సోనియా గాంధీ నిర్ణయించి చెబుతారని వివరించారు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ ఇలాగే ఉండనుంది.

ఇక్కడే మరో కీలక విషయం కూడా ఉన్నది. సచిన్ పైలట్‌తోనూ సోనియా గాంధీ సమావేశం కాబోతున్నారు. సచిన్ పైలట్ చాలా కాలంగా ఈ టాప్ జాబ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఆయన తిరుగుబాటు కూడా చేశారు. అంతకు ముందే గెహ్లాట్ వర్గం, పైలట్ వర్గంగా చీలిపోయి తీవ్ర విభేదాలు నెలకొన్నట్టు కథనాలు వచ్చాయి. ఎలాగోలా అధిష్టానం బుజ్జగించడంతో సచిన్ పైలట్ తిరుగుబాటు విరమించుకున్నారు.

కాంగ్రెస్ చీఫ్ కోసం అశోక్ గెహ్లాట్ సరైన వ్యక్తి అని అధిష్టానం భావించింది. అంతకు ముందే ఆయన సీఎం పదవి వదులుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, సీఎం ఎవరనే నిర్ణయం తమ వద్దే ఉంటుందని కూడా పేర్కొంది. కానీ, సీఎం పదవి వెంటబెట్టుకునే చీఫ్ కోసం పోటీ చేద్దామని గెహ్లట్ భావించారు. కానీ, ఒకరికి ఒక పదవి అనే నిబంధనను కాంగ్రెస్ పాటిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ప్రకటన తర్వాతే రాజస్తాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటు లేసింది. సచిన్ పైలట్‌ను సీఎంగా చేయరాదని, సచిన్ తిరుగుబాటు చేసినప్పుడు గెహ్లాట్‌తో ఉన్నవారిలో నుంచే సీఎంను ఎన్నుకోవలని అల్టిమేటం పెట్టారు. ఇది అధిష్టానాన్ని తీవ్రంగా అసంతృప్తి పరిచింది.

అయితే.. అశోక్ గెహ్లాట్ తాజాగా క్షమాపణలు చెప్పి.. సీఎం నిర్ణయాన్ని అధిష్టానానికే విడిచిపెట్టారు. ఆయనే సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయితే, సచిన్ పైలట్ భేటీ కూడా ఈ సందర్భంగా కీలకంగా ఉండనుంది. సచిన్ పైలట్‌నూ ఎంచుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. 

కాగా, సచిన్ పైలట్‌కు మరోసారి గెహ్లాట్ చెక్ పెట్టాడని ఈ రెండు వర్గాల మధ్య విభేదాలను ఎగదోయడానికి ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే కామెంట్లు విసురుతున్నది. సోనియా గాంధీ నిర్ణయానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరిని సీఎంగా ఎన్నుకున్నప్పటికీ మరో వర్గం అసంతృప్తికి లోనుకావాల్సే ఉంటుంది. ఈ విభేదాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కీలకమే. 2024 ఎన్నికలకు ముందు జరిగే రాజస్తాన్ సహా మరికొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్‌ను ప్రిఫైనల్‌గా చాలా మంది నిపుణులు చూస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios