జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో ప్యాట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ అనుమానిత ఉగ్రవాది సీఆర్‌పీఎఫ్ జవాన్ నుంచి ఓ రైఫిల్‌ను ఎత్తుకెళ్లాడు. ఇప్పుడు అతడి కోసం ఆర్మీ, పోలీసులతో సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపడుతన్నారు. రైఫిల్ ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం జల్లెడ పడుతున్నారు. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఓ అనుమానిత ఉగ్రవాది గస్తీ కాస్తున్న ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ నుంచి సర్వీస్ రైఫిల్‌ను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ దగ్గరి నుంచి ఆ అనుమానిత టెర్రరిస్టు రైఫిల్ ఎత్తుకెళ్లాడు. పుల్వామా జిల్లా దిగువ ప్రాంతాల్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ఏరియాలో సీఆర్‌పీఎఫ్ 183 బెటాలియన్ ప్యాట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.

ఆ అనుమానిత ఉగ్రవాదిని ఇర్ఫాన్ గనీగా గుర్తించారు. లాక్కెళ్లిన సర్వీస్ రైఫిల్‌తో ఎలాంటి ఉగ్ర బీభత్సానికి పాల్పడకుండా అడ్డుకోవడానికి బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ఏరియా మొత్తం కార్డన్ ఆఫ్ చేశాయి. అతడి కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆయుధం ఎత్తుకెళ్లిన వ్యక్తిని దొరకపట్టడానికి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.

Also Read: ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు: జమ్మూ కాశ్మీర్ భద్రతా పరిస్థితిపై అమిత్ షా హై లెవెల్ మీటింగ్..

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత గురించి జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బార్ సింగ్ శనివారం మాట్లాడిన సంగతి తెలిసిందే. 56 పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టులు సహా మొత్తం 186 ఉగ్రవాదు లను పలు ఎన్‌కౌంటర్‌ లలో 2022 ఏడాదిలో మట్టు బెట్టినట్టు వివరించారు. వీరంతా నిషేధిత లష్కర్ ఏ తాయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందినవారని తెలిపారు.