పంజాబ్‌లోని తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి జరిగింది. అర్దరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దాడి జరిగింది.

పంజాబ్‌లోని తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి జరిగింది. అర్దరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దాడి జరిగింది. అమృత్‌సర్-భటిండా హైవేపై సర్హాలి పోలీస్ స్టేషన్‌‌ను ఆనుకుని ఉన్న సాంజ్ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అధికార వర్గాలు తెలిపాయి. సాంజ్ కేంద్రం ఎఫ్‌ఐఆర్‌ల కాపీ, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు వంటి సేవలను అందిస్తుంది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ తొలుత పోలీస్ స్టేషన్ గేటు ఇనుప గ్రిల్స్‌ను ఢీకొట్టి.. ఆపై సాంజ్ కేంద్రాన్ని తాకింది. ఈ ఘటనలో సాంజ్ కేంద్రం కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పాలి. ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. అయితే రాకెట్ శక్తివంతమైనదని.. అయితే అది రీబౌండ్‌ కావడంతో నష్టం పెద్దగా చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా పాకిస్థాన్‌లో కాల్చి చంపబడినట్టుగా వార్తలు వచ్చాయి. అతని స్వస్థలం సర్హాలి. మరో గ్యాంగ్‌స్టర్ డేవిందర్ బంబిహా గ్రూప్ ఈ హత్యకు బాధ్యత వహించింది. ఇటీవల మేలో మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంపై జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడికి రిండా ప్రధాన సూత్రధారి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యలో కూడా అతని పేరు బయటపడింది.