న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న డాన్ శివశక్తినాయుడు మృతి చెందాడు.మీరట్‌లోని వైష్ణోదామ్ కాలనీలో ఓ ప్రాపర్టీ వ్యాపారిని హత్య చేసేందుకు వచ్చిన సమాచారం తెలుసుకొన్న పోలీసులు అతడిని మంగళవారం నాడు మట్టుబెట్టారు.

మీరట్ పట్టణంలలోని ఓ భవనంలో శివశక్తినాయుడును పోలీసులు కాల్చి చంపారు. 2014లో లజపత్ నగర్ లో జరిగిన అతి పెద్ద దోపీడీలో శివశక్తినాయుడు ప్రధాన నిందితుడుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

శివశక్తినాయుడు తన 13 మంది అనుచరులతో కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాజేష్ కర్లా నుండి రూ. 7.69 కోట్లు దోపీడీకి పాల్పడ్డారు.

ఈ నెల 17వ తేదీన ఢిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై ఓ కారును శివశక్తి ముఠా దోచుకొంది. ఈ కారును అపహరించారు దుండగులు. ఈ కారు మీరట్ వైష్ణో డామ్ కాలనీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ కారు ఉన్న భవనం వద్దకు పోలీసులు రాగానే భవనం లోపల నుండి కాల్పులు ప్రారంభమయ్యాయి. అరగంట తర్వాత శివశక్తి నాయుడు గాయాలతో పోలీసులకు చిక్కాడు. కొద్దిసేపటి తర్వాత అతను ఆసుపత్రిలో మృతి చెందాడు.

శివశక్తి నాయుడు జైలు నుండి కూడ తన దందాను కొనసాగించినట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. గతంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన సమయంలో అతను తన దందాను జైలు నుండి నడిపాడు. 

బెయిల్ పై ఉన్న శివశక్తినాయడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. శివశక్తి నాయుడు ఎన్ కౌంటర్ సమయంలో ఓ పోలీస్ అధికారి కూడ గాయపడినట్టుగా సమాచారం. 

ఢిల్లీ పోలీస్ అధికారి లలిత్ మోహన్ నేగీని హత్యచేయాలని శివశక్తినాయుడు కుట్ర పన్నినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

తెలుగు వాడే

శివశక్తి నాయుడు  తెలుగువాడుగా చెబుతున్నారు. శివశక్తినాయుడు తండ్రి వస్త్ర వ్యాపారిగా సమాచారం. చాలా ఏళ్ల క్రితం శివశక్తి నాయుడు కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లింది. డబ్బులు సంపాదించాలనే కోరికతో శివశక్తి నాయుడు డాన్ గా అవతారం ఎత్తినట్టుగా పోలీసులు చెబుతున్నారు. శివశక్తినాయుడు చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.