న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు ఎయిమ్స్‌కు హుటాహుటిన వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

మంగళవారం నాడు రాత్రి సుష్మా స్వరాజ్ కు గుండెపోటు వచ్చింది. గుండెపోటు కారణంగా ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు.  ఎయిమ్స్ కు ఆమెను తరలించిన విషయం తెలిసిన వెంటనే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఆమెను చూసేందుకు ఎయిమ్స్ కు వచ్చారు.

కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీలు హుటాహుటిన ఎయిమ్స్ కు చేరుకొన్నారు. సుష్మా ఆరోగ్యం గురించి ఆరా తీశారు.మంగళవారం రాత్రి ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఆమె ఆరోగ్యం బాగా లేదు.ఈ కారణంగానే ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడ పోటీకి దూరంగా ఉంది.

సుష్మాస్వరాజ్ డయాబెటిక్ పేషేంట్. రెండేళ్ల క్రితం సుష్మాస్వరాజ్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. కాశ్మీర్ విభజనతో పాటు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ సుష్మాస్వరాజ్ మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తదితరులు ఎయిమ్స్ వద్దకు వచ్చారు. సుష్మా కుటుంబసభ్యులను ఓదార్చారు.