న్యూఢిల్లీ: మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం ప్రకటించారు. సుష్మాజీ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని ఆయన అన్నారు. భారతదేశం కోసం ఆమె చేసిన ప్రతి పనికీ ఆమెను గుర్తు చేసుకుంటామని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

సుష్మా కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు అభిమానులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత ఐదేళ్ల పాటు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ నిర్విరామ కృషి చేశారని, ఆమె పనిచేసిన తీరును మరిచిపోలేనని ఆయన అన్నారు తన ఆరోగ్యం బాగా లేని సమయాల్లో కూడా తన పనికి న్యాయం చేయడానికి సాధ్యమైనవన్నీ చేశారని ఆయన అన్నారు. 

సుష్మా స్వరాజ్ స్ఫూర్తికి, నిబద్ధతకు మరొకరు సాటి రారని ఆయన అన్నారు. తాను పనిచేసిన ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఉన్నతమైన ప్రమాణాలను నెలకొల్పారని ఆయన అన్నారు. వివిధ దేశాలతో భారత సంబంధాలు మెరుగుపడడానికి కీలకమైన పాత్ర పోషించారని ఆయన అన్నారు. సిద్ధాంతం కోసం, బిజెపి ప్రయోజనాల కోసం రాజీ లేని కృషి చేశారని ఆయన అన్నారు.