బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సుశాంత్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ.. ఆయన మరణానికి కారణం మాత్రం తెలియరాలేదు. కాగా.. తాజాగా తాజాగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ షిండే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడు హుందాగా వ్యవహరించేవాడని ముఖం చూస్తేనే తెలిసిపోతుందని, ముఖ్యంగా ఎంఎస్‌ ధోని సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించాడని అన్నారు. 

సుశాంత్‌ సింగ్‌ సోదరీమణులు ప్రియాంక సింగ్‌, మీతూ సింగ్‌ తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వడంతో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండానే అతడికి మందులు ఇచ్చారని, అతడి మృతితో తనకు సంబంధం లేదంటూ సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రియాంక, మీతూపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ పిటిషన్‌ గురువారం విచారణకు రాగా.. తీర్పును రిజర్వ్‌ చేసిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే నేతృత్వంలోని ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. కేసు ఏదైనా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముఖం చూస్తే అతడు అమాయకుడు, హుందాగా వ్యవహరించేవాడని, ఓ మంచి మనిషి అన్న విషయం అర్థమవుతుందని అన్నారు. ఎంఎస్‌ ధోని సినిమాలో తన నటన చూసి ప్రతి ఒక్కరు అతడిని ఇష్టపడ్డారని జస్టిస్‌ షిండే చెప్పుకొచ్చారు.

2020 జూన్‌ 14న సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై సీబీఐ విచారణ మొదలుపెట్టగా.. ఈ కేసుతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యారు. సుశాంత్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని కూడా విచారణలో తెలిసింది.