ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ అధికారాన్ని అందుకుంటుందా అన్న దానిపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. వీటి ప్రకారం కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదట.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు (five state election) సంబంధించిన పోలింగ్ నేటితో ముగిసింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడిస్తున్నాయి. దీని ప్రకారం కాంగ్రెస్ (congress), బీజేపీల (bjp) మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

బీజేపీ మరోసారి అధికారాన్ని అందుకునేందుకు పరిస్థితులు అంత సానుకూలంగా లేనట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 . 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్‌ 33.5 శాతం , బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. ఎప్పటిలాగే తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్‌ కూడా బరిలో వుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. 

ఓటింగ్ శాతం విషయానికి వస్తే బీజేపీకి 40.8, కాంగ్రెస్‌కు 39.3 శాతం ఓట్లు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 8.7, ఇతరులకు 11.2 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. సీట్లు పరంగా చూస్తే కాంగ్రెస్‌కి , ఓట్ల పరంగా చూస్తే బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. మరి బీజేపీ మరోసారి అధికారాన్ని అందుకుంటుందా లేక కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందా లేదా తెలియాలంటే మార్చి 10 వరకు ఎదురుచూడాల్సిందే.

ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగ్గా.. 65.37 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన 632 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 

బీజేపీ తరపు నుంచి మంత్రులు సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థులలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, మాజీ మంత్రి యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఉత్తరాఖండ్ యూనిట్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 11, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.

ప్ర‌ముఖ ద‌ళిత నేత ఆర్య‌, త‌న కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యేతో క‌లిసి కాంగ్రెస్‌లోకి తిరిగి రావ‌డం హస్తం శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌క బీజేపీని దీటుగా ఎదుర్కొని అధికారాన్ని చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు కూడా ముమ్మరంగానే ప్రచారం నిర్వహించాయి. గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ వుంటోంది. ప్రజలు సైతం ప్రభుత్వాలను మారుస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఐదేళ్లకొకసారి అధికారాన్ని అందుకుంటున్నాయి. ఇదే సమయంలో ఈసారి ఆప్ బరిలో నిలవడంతో ఈ రెండు పార్టీల విజయావకాశాలకు దెబ్బ కొట్టే పరిస్ధితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 

రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే, రహదారుల నిర్మాణం, కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణం వంటి వాటిని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలు చేసింది. అటు ఆప్ విషయానికి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 18 ఏళ్లు పైబడిన మహిళకు నెలకు రూ.1000 ఆర్ధిక సాయం, కుటుంబానికో ఉద్యోగం, రూ.5 వేల నిరుద్యోగ భృతి వంటి ప్రజాకర్షక హామీలను ప్రకటించింది.