భోపాల్: నామినేషన్ పత్రంలో తాను ఒక్క ఏడాదిలో పీజీ పూర్తిచేసినట్టు పేర్కొన్న ఓ మంత్రిగారి భవితవ్యం డైలామాలో పడింది. గత ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఒకలా ఇప్పుడు మరోలా నామినేషన్ పత్రం, అఫిడవిట్ దాఖలు చెయ్యడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిఈవో ఆయన నామినేషన్ పత్రాన్ని పెండింగ్ లో పెట్టారు. దీంతో మంత్రిగారి రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది. 

వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగా ప్రస్తుత మంత్రి సురేంద్ర పట్వా తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే మంత్రిగారు పీజీ పూర్తి చేసినట్లు ఉండటంతో అనుమానం వచ్చిన ప్రత్యర్థులు ఆరా తీశారు. గత అఫిడవిట్ ను సంపాదించి ఎన్నికల కమిషన్ ముందుంచారు. 
 
సురేంద్ర పట్వా తన నామినేషన్ సందర్భంగా 1984లో కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినట్టు తెలియజేశారు. అయితే 2013 ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రంలో తాను 1983లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. 

అంటే ఒక్క ఏడాదిలోనే ఎంకామ్ పూర్తి చేసినట్టన్నమాట. మంత్రిగారి నామినేషన్ పత్రాలు చూసిన స్వతంత్ర అభ్యర్థులు మన్‌సింగ్ రఘువన్షీ, రవీంద్ర సాహులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో పట్వా నామినేషన్ పెండింగ్ లో పెట్టారు రిటర్నింగ్ అధికారి.  
 
అంతేకాదు మంత్రి సురేంద్ర పట్వా అఫిడవిట్ లో అన్ని తప్పుల తడకలేనని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి తన అఫిడవిట్లో ఓ చోట రూ.34 కోట్లు రుణం తీసుకున్నాననీ, తన భార్య రూ 2.5 కోట్ల రుణం తీసుకున్నారని రాశారు. అయితే మరోచోట తనకు రూ.14 కోట్ల అప్పులున్నాయనీ, తన భార్యకు ఎలాంటి అప్పులు లేవని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కూడా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ అధికారి వివరణ ఇవ్వాలని మంత్రిని కోరారు. ఇలా అడ్డంగా బుక్కయిన మంత్రి సురేంద్ర పట్వా మామూలు వ్యక్తికాదు. ఏళ్లతరబడి రాజకీయాల్లు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా మేనల్లుడు. 

సురేంద్ర పట్వా రైసేన్ జిల్లాలోని భోజ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2013 ఎన్నికల్లో భోజ్ పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ పచౌరీపై గెలుపొందారు. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అదే నియోకవర్గం నుంచి పచౌరీపైనే పోటీకి దిగుతున్నారు.