మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉన్న డ్యాన్స్‌ బార్లపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్‌బార్లను నిషేధించింది. ఈమేరకు బాంబే పోలీస్ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై డ్యాన్స్‌ బార్ల యజమానులు హైకోర్టుకు వెళ్లడం.. దీనిపై న్యాయస్థానం స్టే విధించడం.. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధఇంచింది. అయితే దీనిపై రెస్టారెంట్లు, బార్ల సంఘం మరోసారి సుప్రీంను ఆశ్రయించడంతో జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మరోసారి వాదనలు వినింది.

ఈ సందర్భంగా డ్యాన్స్‌బార్ల పేరుతో విశృంఖలంగా, అసభ్యరీతిలో నృత్యాలతో పాటు పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీనితో పాటు రాష్ట్రంలో కేవలం 345 డ్యాన్స్ బార్లకు మాత్రమే అనుమతి ఉండగా... ఏకంగా 2,500 బార్లలో ఇటువంటి కార్యక్రమాలు సాగుతున్నాయని కోర్టుకు వివరించింది.

అయితే రాష్ట్రంలో దాదాపు 70 వేల మంది మహిళలు డ్యాన్స్‌బార్లలో పనిచేస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయంతో వారంతా ఉపాధి కోల్పోయారని, వీరిలో చాలామంది ఆర్థికపరమైన సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని రెస్టారెంట్లు, బార్ల సంఘం ధర్మాసనానికి తెలిపింది.

ఇరు వర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. డ్యాన్స్‌బార్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. వీటిని అదుపు చేయడం సరైనదే కానీ.. నిషేధించడం మాత్రం సరికాదని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. మరోవైపు నిషేధాన్ని ఎత్తివేస్తూనే రెస్టారెంట్లు, బార్ల సంఘానికి కొన్ని షరతలు విధించింది.  

ఆయా బార్లలో డ్యాన్సర్లపై డబ్బులు వెదజల్లరాదని, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతానికి కనీసం కిలోమీటరు దూరంలో డ్యాన్స్ బార్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. బార్లలో మద్యాన్ని సేవించే ప్రదేశానికి దూరంగా మహిళలు డ్యాన్స్ చేసే వేదిక వేరుగా ఉంచడాన్ని సైతం న్యాయస్థానం తప్పుబట్టింది. సుప్రీం తీర్పుతో డ్యాన్సర్లు, బార్లు-రెస్టారెంట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.