Asianet News TeluguAsianet News Telugu

క‌ర్ణాట‌క హిజాబ్ నిషేధంపై "సుప్రీం" సంచ‌ల‌న‌ తీర్పు నేడే .. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌.. 

కర్ణాటక హిజాబ్ నిషేధం కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. హిజాబ్‌పై నిషేధాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై 10 రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ 22న పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విష‌యం తెలిసిందే.. 

Supreme Court verdict on Karnataka Hijab ban case today
Author
First Published Oct 13, 2022, 9:46 AM IST

కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంలో నేడు మ‌రో కీల‌క‌ పరిణామం జ‌రుగునున్న‌ది. ఈ వివాదంపై క‌ర్ణాట‌క‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేడు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. దీనికి సంబంధించిన తీర్పును జస్టిస్‌ హేమంత్‌గుప్తా, సుధాన్షు ధులియా ధర్మాసనం వెల్లడించనుంది. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనున్న‌ట్టు స‌మాచారం. గతంలో న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం 10 రోజుల పాటు ఈ వ్యాజ్యాన్ని విచారించిన తర్వాత సెప్టెంబర్ 22న తన తీర్పును రిజర్వ్ చేసిన విష‌యం తెలిసిందే.. 
 
క‌ర్ణాట‌క‌ హిజాబ్ వివాదం కేసులో విద్యాసంస్థ‌ల్లో యూనిఫాంను పూర్తిగా పాటించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల‌ను సమర్థిస్తూ హైకోర్టు తీర్పును వెల్ల‌డించింది, అయితే,, ఆ నిర్ణయాన్ని సవాలు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖలు అయ్యింది. మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని హైకోర్టు పేర్కొంది. హిజాబ్ ధరించడం తమ ప్రాథమిక హక్కు అని, అందుకే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేశామని పిటిషనర్లు పేర్కొన్నారు. గత 10 నెలలుగా ఈ వివాదం కొన‌సాగుతోంది. 

హిజాబ్ వివాదం కేసులో ఎప్పుడు ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం.

అక్టోబరు 2021: క‌ర్ణాట‌క‌లోని ఉడిపి ప్రభుత్వ పీయూ( PU) కాలేజీలో వివాదం ప్రారంభమైంది. ఈ కాలేజీలో కొంతమంది అమ్మాయిలు హిజాబ్ ధరించాలని డిమాండ్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీని తర్వాత విషయం అణచివేయబడింది, కానీ, 31 డిసెంబర్ 2021 న ఈ కళాశాలలో హిజాబ్ ధరించిన 6 మంది బాలికలు తరగతికి రాకుండా ఆపారు. అనంతరం కళాశాల వెలుపల ప్రదర్శన ప్రారంభించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

జనవరి 19, 2022: ఈ విష‌యంపై కళాశాల అడ్మినిస్ట్రేషన్ బాలిక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. కానీ.. ఎలాంటి ఫలితం లేదు.

జనవరి 26, 2022: మళ్లీ సమావేశం. హిజాబ్ లేకుండా రాలేని బాలికలు ఆన్‌లైన్‌లో చదవాలని ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ అన్నారు.

జనవరి 27, 2022: బాలిక విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి కూడా నిరాకరించారు. దీంతో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ముస్లిం విద్యార్థినులు కాలేజీ గేటు వ‌ద్ద‌ ప్రదర్శన చేశారు. సోష‌ల్ మీడియాలో విష‌యం తెగ వైర‌ల్ అయ్యింది. 

ఫిబ్రవరి 2, 2022: ఉడిపిలోని కుందాపూర్ ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ వివాదం సెగ‌లు ప్రారంభయ్యాయి.  హిజాబ్‌కు ప్రతిస్పందనగా హిందూ విద్యార్థులు, బాలికలు కండువాలు  ధరించి కళాశాలకు వచ్చారు.

ఫిబ్రవరి 3, 2022: కుందాపూర్‌లోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన బాలికలను అడ్డుకున్నారు. దీంతో వివాదం మ‌రింత హీటెక్కింది. 

ఫిబ్రవరి 5, 2022: హిజాబ్ ధరించిన బాలికలకు రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. హిజాబ్‌ను చదువుకు దారిలోకి తెచ్చి.. భారత కూతుళ్ల భవిష్యత్తును లాగేసుకుంటున్నారని ట్వీట్‌ చేశారు.  

ఫిబ్రవరి 8,  2022: ఈ వివాదంపై కర్ణాటకలో చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. త్రివర్ణ స్థంభానికి ఓ కళాశాల విద్యార్థి కాషాయ జెండాను ఉంచిన వీడియో షిమోగా నుండి వచ్చింది. పలు చోట్ల రాళ్లు రువ్వినట్లు సమాచారం. మండ్యలో బురఖా ధరించిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన ఎదుట విద్యార్థులు కాషాయం పెట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

ఫిబ్రవరి 9, 2022: ఈ కేసులో పిటిషనర్లకు ఎలాంటి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు జస్టిస్ కృష్ణ దీక్షిత్ నిరాకరించారు. ఏకంగా త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు. 

ఫిబ్రవరి  11, 2022: విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు, ఈ వ్యాజ్యాన్ని ముందస్తుగా విచారించడానికి సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా నిరాకరించింది.  

ఫిబ్రవరి 12, 2022: దిగజారుతున్న పరిస్థితిని చూసి, మూడు రోజుల పాటు అన్నివిద్యాసంస్థ‌ల‌ను మూసివేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్డర్ జారీ చేయబడింది. ఫిబ్రవరి 15 వరకు కాలేజీలు మూతపడ్డాయి. 

ఫిబ్రవరి 17, 2022: హిజాబ్ వివాదం కేవలం ఎనిమిది ఉన్నత పాఠశాలలు, కళాశాలలకే పరిమితమైందని ప్రభుత్వం తెలిపింది.

ఫిబ్రవరి 18, 2022: 20 మంది విద్యార్థులు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హిజాబ్‌కు సంబంధించిన అన్ని ప్రదర్శనలను ప్రభుత్వం నిషేధించింది. అయితే.. కళాశాల దానిని ఉల్లంఘించింది.

ఫిబ్రవరి 24, 2022: కర్ణాటక విద్యాశాఖ మంత్రి తరపున హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఏ సంస్థలోనూ సిక్కు తలపాగాపై నిషేధం లేదని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 25, 2022: హిజాబ్ కేసును 11 రోజుల పాటు విచారించిన తర్వాత.. హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

మార్చి 15, 2022: హిజాబ్ కేసుపై హైకోర్టు చివరకు తీర్పు ఇచ్చింది.  హిజాబ్ మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాల‌ని పేర్కొంది. హిజాబ్ మహిళల ప్రాథమిక హక్కు కాద‌ని అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చే హక్కును కూడా ప్రభుత్వానికి ఇచ్చింది.

అప్పటి నుంచి కేసు సద్దుమణిగిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 2022లో హిజాబ్ కేసుపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై 10 రోజుల పాటు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్ర‌మంలో నేడు ఈ వివాదంపై సుప్రీం కోర్టు కీల‌క‌ నిర్ణయం వెలువ‌రించ‌నున్న‌ది.

Follow Us:
Download App:
  • android
  • ios