త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నందున ఎన్నికలు స్వేచ్ఛాయుత, పారదర్శక విధానంలో ఎన్నికలు జరిపేందుకు అవకాశం లేని ఈ యంత్రాలను వాడకుండా ఆదేశాలివ్వాలని ‘‘న్యాయ్‌భూమి’’ అనే స్వచ్ఛంధ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతి యంత్రాన్ని సద్వినియోగించుకోవచ్చని.. దుర్వినియోగపరచుకోవచ్చునని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రతి విధానంపైనా అనుమానాలుంటాయని.. అయితే ప్రస్తుత విధానం సంతృప్తికరంగానే ఉందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.