అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించింది.

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం 2019లో 103 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా.. అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తూ కాలేజ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. అయితే ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. రిజర్వేషన్లపై 1992లో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటిని ఈ కోటాను ఎలా ఇస్తారని పలువురు పిటిషనర్లు ప్రశ్నించారు. 

అయితే దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, ఎస్ రవీంద్ర భట్, బేల ఎం త్రివేది, జేబీ పార్దీవాలా కూడా ఉన్నారు. ఇటీవల ఇందుకు సంబంధించి విచారణను ముగించిన ధర్మాసనం.. నేడు తీర్పును వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో సమర్ధించింది. ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, బేల ఎం త్రివేది, జేబీ పార్దీవాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునివ్వగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ విభేదించారు.

జస్టిస్ దినేష్ మహేశ్వరి తన తీర్పును చదువుతూ.. EWS రిజర్వేషన్ సమానత్వ కోడ్‌ను, రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాన్ని ఉల్లంఘించదని అన్నారు. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎప్పుడు ఒకేలా ఉండేలా లేదని పేర్కొన్నారు. జస్టిస్ మహేశ్వరి ప్రకటనతో ఏకీభవించిన జస్టిస్ బేల ఎం త్రివేది.. ‘‘కోటాను పార్లమెంటు ధృవీకరించే చర్యగా పరిగణించాలి. ఆర్టికల్ 14 లేదా రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించబడలేదు’’ అని పేర్కొన్నారు. “EWS కోటా రిజర్వ్‌డ్ తరగతుల హక్కులను దాని పరిధి నుంచి మినహాయించడం ద్వారా వారిని ప్రభావితం చేయదు. కుల వ్యవస్థ సృష్టించిన అసమానతలను పరిష్కరించేందుకే రిజర్వేషన్లు తీసుకొచ్చారు. 75 సంవత్సరాల తర్వాత, పరివర్తనాత్మక రాజ్యాంగవాదం తత్వశాస్త్రానికి అనుగుణంగా జీవించడానికి మనం విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. జస్టిస్ జేబీ పార్దివాలా కూడా ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించారు. 

జస్టిస్ భట్ మాత్రం వారి తీర్పుతో విభేదించారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటా.. సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై నిర్ణయించిన 50 శాతం పరిమితిని దాటుతుందని అన్నారు. రిజర్వేషన్‌పై సెట్ చేసిన 50 శాతం పరిమితిని ఉల్లంఘించడాన్ని అనుమతించడం మరింత ఉల్లంఘనలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. సీజేఐ జస్టిస్ లలిత్ కూడా జస్టిస్ భట్ అభిప్రాయానికి అంగీకరించారు. తద్వారా ఈ అంశంపై 3-2 తీర్పు వచ్చింది.