త్రివిధదళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎపీ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాలను ఢిల్లీ హైకోర్టుకు తీసుకెళ్లాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అగ్నీపథ్ పథకంపై దాఖలైన పిల్‌లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు కోరింది. అయితే ఒక అంశంపై అనేక పిటిషన్లు కోరదగినవి, సరైనవి కావని పేర్కొంది.
ఇక, విచారణ సందర్భంగా.. అగ్నిపథ్‌పైఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘‘ఈ కోర్టు ముందు వేసిన మూడు రిట్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని.. ఆర్టికల్ 226 ప్రకారం పిటిషన్లుగా పునర్నిర్మించాలని మేము భావిస్తున్నాము’’ అని పేర్కొంది.
అగ్నిపథ్ స్కీమ్ విషయానికి వస్తే.. ఇది ఆర్మీలో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం ప్రకటించిన పథకం. ఈ స్కీం కింద ఆర్మీ, నేవి, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. ఈ పథకం కింద రిక్రూట్ చేసుకున్న యువతకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు బాధ్యతలు ఇస్తారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపున్న అభ్యర్థులు ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్ చేసుకున్నవారు నాలుగేళ్లపాటు ఆర్మీలో సేవలు అందించవచ్చు. ఆ తర్వాత పర్మినెంట్ క్యాడర్ కోసం కూడా స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల కాలంలో వారి ప్రదర్శన, మెరిట్ల ఆధారంగా పర్మినెంట్ సర్వీస్ కోసం ఎంపిక చేస్తారు. 25 శాతం దరఖాస్తులను పర్మినెంట్ క్యాడర్ కోసం పరిగణించే అవకాశం ఉన్నది.
దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పలు చోట్ల ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రైళ్లకు కూడా నిప్పు పెట్టారు.
