సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా  కోర్టు ప్రొసిడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. గతంలో కోర్టు ప్రోసిడింగ్స ప్రత్యక్ష ప్రసారానికి త్రిసభ్య ధర్మాసనం అనుమతిని ఇచ్చింది. అయితే తొలిసారిగా కోర్టు ప్రోసిడింగ్స్ ఇవాళ  ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

న్యూఢిల్లీ: 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇవాళ సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఇవాళ విచారించిన కేసుకు సంబంధించిన ప్రోసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణకు ఇవాళే చివరి రోజు. ఇవాళ ఆయన రిటైర్ కానున్నారు. 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ ఇటీవలనే నియమితులయ్యారు. లలిత్ రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రోసీడింగ్స్ ను ఎన్ఐసీ వెబ్ కాస్ట్ పోర్టల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, ఉదయ్ ఉమేష్ లలిత్ , జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

2018 సెప్టెంబర్ 26న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్ లతో కూడిన త్రి సభ్య ధర్మాసనం కోర్టులో జరిగే రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత కలిగిన కేసులను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతిని ఇచ్చింది.