హింసతో కల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో మూడు నెలలుగా ఇంటర్నెట్ సేవలపై నిషేధం అమలవుతున్నది. ఈ బ్యాన్ ఎత్తేయాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను సుప్రీంకోర్టు ఆలకించనుంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత మూడు నెలలు హింసాజ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. కుకీ, మైతేయి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. అయితే.. ఆది నుంచి ఇక్కడ హింసను అడ్డుకునే కారణంతో ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. కానీ, హింస మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సీరియస్ ట్వీట్ ఒకటి చేశారు.

రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని, ఈ సేవలు నిలిపేయడం వల్ల సాధారణ ప్రజలకూ తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని మణిపూర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు వెంటనే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, మణిపూర్ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మణిపూర్ ప్రభుత్వ అప్పీల్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆలకించనుంది. ఈ సందర్భంలో శశిథరూర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Scroll to load tweet…

మూడు నెలలుగా మణిపూర్‌లో డిజిటల్ లైఫ్‌ను అడ్డుకున్న దారుణమైన ఇంటర్నెట్ బ్యాన్‌ను ఎత్తేయాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మణిపూర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని శశిథరూర్ వివరించారు. ఇంటర్నెట్ బ్యాన్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2022లోనే ఇంటర్నెట్ బ్యాన్‌ను సబబు కాదనే అభిప్రాయం వెలుబుచ్చినట్టు వివరించారు. ఇంటర్నెట్ సేవలు హింస, ఉగ్రవాదం, ఇతర ఘర్షణలను ఎక్కడా అడ్డుకున్నట్టు ప్రభుత్వం నుంచి సహేతుక వివరణ ఏదీ లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొందని శశిథరూర్ పేర్కొన్నారు. 

Also Read: పవన్ పై వాలంటీర్‌ను నిలబెట్టి ఓడిస్తాం: మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్

ఇంటర్నెట్ బ్యాన్ రక్షణ పరమైన హామీల కంటే కూడా సాధారణ పౌరులకు కలుగజేసే సమస్యలే అధికంగా ఉంటాయని శశిథరూర్ తెలిపారు. హింసను తగ్గించే అవకాశాలే లేకున్నా సాధరాణ పౌరుల జీవనానికి తీవ్ర అంతరాయాన్ని కలుగజేసే ఇంటర్నెట్ బ్యాన్‌ను తరుచూ అమలు చేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత్ కావడం శోచనీయం అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పౌరుల హక్కుల తరఫున నిలబడుతుందని ఆశిస్తున్నానని వివరించారు. ఈ ఇంటర్నెట్ బ్యాన్ వల్ల వాటిని సమర్థిస్తున్న ఈ ‘బాబుల’కు పెద్దగా ఆటంకాలేమీ కలుగవని, వీరు సాధారణ ప్రజలకు పూర్తిగా భిన్నమైనవారనీ తెలిపారు. కానీ, దీని వల్ల కొన్ని నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో ప్రజలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు, ఎన్‌రోల్‌మెంట్లు, పరీక్షలు, ఇతర కీలకమైన సమాచారం పొందడం వంటి వాటికి వారు దూరమయ్యారని వివరించారు. ఈ దారుణమైన సంప్రదాయానికి కోర్టు కచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.