ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలన్న ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. ఈ విచారణకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బీజేపీయేతర పార్టీల నేతలు హాజరుకానున్నారు.

ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి సోమవారం సాయంత్రమే బాబు ఢిల్లీ చేరుకున్నారు.

రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులోనే వినాలని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ సీజేఐ దృష్టికి తీసుకురావడంతో చీఫ్ జస్టిస్ అందుకు అంగీకరించారు.

ఈవీఎంలను కొన్ని పద్దతుల్లో ప్రభావితం చేసి వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని.. అందువల్ల వీవీప్యాట్‌ స్లిప్పులను కూడా లెక్కించాలని చంద్రబాబు గత కొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి టీడీపీతో పాటు 21 పార్టీలు సుప్రీంలో పిటిషన్ వేశాయి.