పశ్చిమ  బెంగాల్‌లో ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8వ తేదీన వెలువరించిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది.

న్యూఢిల్లీ:  పశ్చిమ బెంగాల్‌లో ‘‘ది కేరళ స్టోరీ’’ చిత్రంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8వ తేదీన వెలువరించిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీం కోర్టు.. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) సర్టిఫికేట్ మంజూరు చేసినందున శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

తమిళనాడులో భద్రతా కారణాల దృష్ట్యా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో సినిమా ప్రేక్షకులకు భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ‘‘మేము పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర్వుపై స్టే విధించాలనుకుంటున్నాము. తమిళనాడుకు సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిషేధించవద్దని మేము వారికి నిర్దేశిస్తాము’’ అని ధర్మాసనం పేర్కొంది. 

‘‘మే 20 సాయంత్రం 5 గంటలలోపు సినిమాకు సంబంధించి ఓ డిస్‌క్లెయిమర్ వేయాలని.. 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మహిళలను ఇస్లాంలోకి మార్చారనే వాదన కేవలం ఊహాజనితమని, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక డేటా లేదని చెప్పండి’’ అని ధర్మాసనం నిర్మాతలను ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో ‘‘ది కేరళ స్టోరీ’’ చిత్రంపై నిషేధం విధిస్తూ మమతా సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సినిమా ప్రదర్శనపై నిషేధం విధించింది. అయితే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో తమ సినిమాపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ‘‘ది కేరళ స్టోరీ’’ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గత విచారణలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఎందుకు బ్యాన్‌ చేశారని పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఏ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. సినిమా ప్రదర్శితమయ్యే సినిమా థియేటర్లకు తగిన భద్రత కల్పించేందుకు తీసుకున్న చర్యల గురించి తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం వివరణ కోరింది.

ఇదిలా ఉంటే.. ‘‘ది కేరళ స్టోరీ’’ చిత్రం ట్రైలర్ విడుదలతోనే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక, అదా శర్మ నటించిన ఈ చిత్రం మే 5న సినిమా థియేటర్లలో విడుదలైంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళకు చెందిన మహిళలు ఇస్లాం మతంలోకి బలవంతంగా మారారని, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చేత రిక్రూట్‌ చేయబడ్డారని పేర్కొంది.