పూరీ జగన్నాథుని రథ చక్రాలకు సుప్రీం కరోనా బ్రేకులు
గత 452 సంవత్సరాల్లో 32 సార్లు రథయాత్ర వాయిదాపడ్డ సందర్భాలు ఉన్నందున, భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుంటూ రథయాత్రపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో పూరి జగన్నాథుని రథయాత్ర జరుగుతుందా జరగదా అన్న సందిగ్ధతకు తెరదించుతూ... సుప్రీంకోర్టు రథయాత్రపై స్టే విధించింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ... రథయాత్రను గనుక నిర్వహిస్తే... ఆ దేవుడే మనల్ని క్షమించడు అని కోర్ట్ వ్యాఖ్యానించింది.
పూరి జగన్నాథుడి రథాన్ని సాధారణంగా ప్రజలు లాగుతారు.కానీ, భౌతిక దూరం నిబంధనలకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తిని, గజరాజులను వినియోగిస్తూ నిర్వహించుకోవాలని హై కోర్టు చెప్పడంపై భారతీయ వికాస్ పరిషత్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. ఇలా ఏనుగులను, యాంత్రికశక్తిని వినియోగించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని కోర్టుకు విన్నవించారు.
గత 452 సంవత్సరాల్లో 32 సార్లు రథయాత్ర వాయిదాపడ్డ సందర్భాలు ఉన్నందున, భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుంటూ రథయాత్రపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది.
ఇకపోతే భారతదేశంపై కరోనా పంజా విసురుతూనే ఉంది. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో ఇండియాలో 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,66,946కి చేరుకొన్నాయి.కరోనాతో దేశంలో ఇప్పటికే 12,237 మంది మృత్యువాత పడ్డారు.
కరోనా సోకిన 1,94,325 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకొన్నారు. కరోనా సోకిన రోగులు కోలుకొంటున్న సంఖ్య 52.95కి చేరుకొన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల్లో కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించే పరిస్థితి లేదని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
కరోనా కేసుల్లో ప్రపంచంలోని నాలుగో స్థానానికి ఇండియా ఎగబాకింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత ఇండియా నిలిచింది.
ఇప్పటివరకు నమోదైన కేసుల కంటే అత్యధికంగా ఇండియాలో కేసులు నమోదయ్యాయి. 12,881 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది. ఒక్క రోజు వ్యవధిలోనే 334 మంది మృత్యువాత పడ్డారు.
మిజోరాంలో 9 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 130కి కరోనా కేసులు చేరుకొన్నాయి. కరోనా సోకిన వారిలో ఒక్కరు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.