దేశంలో ఉచిత వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారి నుంచి రుసుము వసూలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది

దేశంలో ఉచిత వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారి నుంచి రుసుము వసూలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎక్కువ మంది బాధితులు ఈ వయస్సు వారేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా వైరస్‌ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగానే ఉందని, చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం బుధవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా కీలకమని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ అమలు విధానంలో చాలా లోపాలు ఉన్నాయనీ, తక్షణం వాటిని సమీక్షించి, పరిష్కరించాలని కేంద్రానికి సూచించింది. డిసెంబరు 31 నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. సాధ్యాసాధ్యాలపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని సుప్రీం ఆదేశించింది.

Also Read:గుడ్‌న్యూస్: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు

వ్యాక్సిన్‌ ధరలపై మరోసారి పరిశీలించాలని.. అలాగే టీకాల కొనుగోలు వివరాలను, వ్యాక్సిన్‌ విధానానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాల సమీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని తెలిపింది. వైరస్‌లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో 18-44 వయస్సు వారికి కూడా వ్యాక్సిన్‌ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ధర్మాసనం పేర్కొంది. అయితే తొలుత ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిర్ణయించాలని సుప్రీం వెల్లడించింది.

18-44 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరాన్ని సుప్రీం మరోసారి పునరుద్ఘాటించింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత తొలి రెండు విడతల్లోనూ కేంద్రం వ్యాక్సిన్లను ఉచితంగానే అందించిందని గుర్తు చేసింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, ప్రజల నుంచి కొంత మొత్తం వసూలు చేసి టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం సరికాదని సుప్రీం స్పష్టం చేసింది. మరోవైపు కార్యనిర్వాహక వ్యవస్థ విధానాలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదన్న వాదనపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. కార్యనిర్వాహక విధానాల వల్ల పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఘాటుగా బదులిచ్చింది.