కరోనా ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువులను సుప్రీంకోర్టు ప్రకటించింది. మార్చి 20వ తేదీకి ముందు కరోనాతో మరణించినవారి కుటుంబాలు 60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో కరోనా మరణాలు చోటుచేసుకుంటే.. వారి కుటుంబ సభ్యులు 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. అలాగే, దరఖాస్తు అందగానే.. నెల రోజుల్లోగా దరఖాస్తుదారుడికి డబ్బులు అందాలని తెలిపింది.
న్యూఢిల్లీ: కరోనా ఎక్స్‌గ్రేషియాకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను సుప్రీంకోర్టు ఫిక్స్ చేసింది. ఎన్ని రోజుల్లోపు ఈ దరఖాస్తును బాధిత కుటుంబం పూర్తి చేసుకోవాలనే అంశంపై ఈ రోజు స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 20వ తేదీ కంటే ముందు కరోనా మహమ్మారితో మరణించినవారి కుటుంబాలకు ఆ తర్వాత కరోనాతో మరణించినవారి కుటుంబాలకు వేర్వేరు గడువు విధించింది. మార్చి 20వ తేదీ కంటే ముందే మరణించినవారి కుటుంబ సభ్యులు 60 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. మార్చి 24 నుంచి 60 రోజుల్లోగా వారి దరఖాస్తు పూర్తి కావాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, భవిష్యత్‌లో కరోనా మహమ్మారితో మరణించేవారి కుటుంబ సభ్యులకు ఈ గడువును 90 రోజులుగా నిర్ధారించింది. భవిష్యత్‌లో ఈ మహమ్మారి పేషెంట్‌ను పొట్టనబెట్టుకుంటే ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారం కోసం 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.
కరోనా పేషెంట్ మరణించిన తర్వాత 4 వారాల్లో ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకునేలా ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కానీ, ఆ సూచనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ ఆప్తులు మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతారని వివరించింది. కాబట్టి, నాలుగు వారాల్లో వారు ఎక్స్‌గ్రేషియాకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాని పని అని తెలిపింది. కాబట్టి, ఈ పరిమితిని పెంచుతూ తాజాగా, తీర్పు వెలువరించింది.
అదే విధంగా కరోనా ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు అందగానే 30 రోజుల్లోగా దానికి సంబంధించిన పేమెంట్ జరిగిపోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది గతంలో సుప్రీంకోర్టు సూచించిన గడువే. దరఖాస్తు అందిన తర్వాత 30 రోజుల్లో పరిహారాన్ని దరఖాస్తుదారుకు అందజేయాలని వివరించింది.
సుప్రీంకోర్టు మరో మినహాయింపు కూడా ఇచ్చింది. నిర్దేశిత గడువులోపు బాధిత కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు దరఖాస్తు చేసుకోలేకపోతే వారికి మరో అవకాశాన్ని ఇచ్చింది. వారు గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీని ఆశ్రయించవచ్చునని తెలిపింది. ఆ కమిటీకి తమ దరఖాస్తు అందజేయాలని పేర్కొంది. ఆ దరఖాస్తును పరిశీలించి నిర్దేశిత గడువులో ఆ కుటుంబం నిజంగానే దరఖాస్తు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చనే నిర్ణయానికి ఆ కమిటీ వస్తే.. గడువు దాటిపోయినప్పటికీ ఆ దరఖాస్తును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
అదే విధంగా నకిలీ దరఖాస్తుదారులను ఉపేక్షించేది లేదన్నట్టుగా ప్రభుత్వం ఉణ్నది. ఈ ఫేక్ క్లెయిమ్స్‌కు చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు ఓ సూచన చేసింది. తొలిసారిగా వచ్చిన దరఖాస్తుల్లో 5 శాతం దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొంది. ఎవరైనా నకిలీ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిస్తే.. వారిపై డీఎం చట్టంలోని 52వ సెక్షన్ కింద శిక్ష వేయాలని తెలిపింది.
అస్సాం నుంచి దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఆర్ షా..జస్టిస్ బి.వి.నాగరత్నల సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి నెలలో ఈ విషయాన్ని తెలిపింది. మృతులకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలో స్పష్టత లేదంటూ పిటిషనర్ పేర్కొన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నప్పటికి కుటుంబంలో ఒకరు చనిపోతే రూ.50,000, ఇద్దరు మరణిస్తే లక్ష అందజేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిని, తండ్రిని కోల్పోయినట్లయితే… రెండు deathsగా పరిగణించి రూ. లక్షను వారి సంతానానికి సమకూర్చాలని పేర్కొంది
