దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
దిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విజృంభించే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. వచ్చే నెల(డిసెంబర్)లో కరోనా విజృంభణను అడ్డుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలంటూ సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండ్రోజుల్లో ప్రక్రియ పూర్తిచేసి తమకు నివేదిక అందించాలని సూచించింది.
గుజరాత్, డిల్లీలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేస్తూ నివేదికను సమర్పించాలని కోరింది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలకు ఉపక్రమించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితి గురించి తెలుసుకోడానికి రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపుతోంది. అందులో భాగంగా సోమవారం ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌కు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలు పర్యటించనున్నారు.
కేంద్ర బృందాలు తాము పర్యటించే రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వైరస్ కట్టడికి స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను పరిశీలించి తగు సూచనలు చేయడంతో పాటు కావాల్సిన సాయాన్ని అందించాల్సిందిగా కేంద్రానికి నివేదిక అందించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 23, 2020, 1:45 PM IST