రైలు ప్రయాణంలో ఎవరి వస్తువులకు వారే బాధ్యులని, దొంగతనాలకు రైల్వే శాఖ బాధ్యత వహించదని సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది.  

రైల్వేకు సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చింది. రైలు ప్రయాణంలో ప్రయాణీకుల వ్యక్తిగత వస్తువులు దొంగిలించ బడినట్లయితే.. దానికి రైల్వే యాజమాన్యం బాధ్యత వహించదని, ఎవరి వస్తువులకు వారే బాధ్యులని, దొంగతనానికి గురైన వస్తువులకు రైల్వే శాఖ బాధ్యత తీసుకోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వినియోగదారుల ఫోరం నిర్ణయాన్ని పక్కన పెడుతూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ప్రయాణికుడు తన లగేజీకి తానే బాధ్యుడనీ, దానికి రైల్వేశాఖ ఎలా బాధ్యత వహించదని పేర్కొంది. అలాగే.. దొంగతనానికి గురైన వస్తువులకు పరిహారం కోరరాదని తేల్చిచెప్పింది. 

రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో తన బ్యాగ్ నుండి లక్ష రూపాయాలు చోరీకి గురయ్యాయని సురేంద్ర భోలా అనే ప్రయాణికుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పరిగణనలోకి తీసుకున్న వినియోగదారుల ఫోరం.. అ ప్రయాణికుడికి రూ. లక్ష పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది.

దానిని జాతీయ వినియోగ దారుల వివాదాల పరిష్కార కమిషన్ కూడా (2015లో) సమర్థించింది. దీంతో రైల్వే శాఖ సుప్రీంలో అప్పీలు చేయగా ఆ ఆదేశాలను పక్కనపెడుతూ తీర్పిచ్చింది. ప్రయాణీకుల నుంచి లక్ష రూపాయలు దోచుకోవడం రైల్వే శాఖలో లోపభూయిష్టంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది.