న్యూఢిల్లీ: వివాహానంతరం బలవంతపు మత మార్పిడికి నిరోధించేందుకు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు బుధవారంనాడు నిరాకరించింది.

ఉత్తర్‌ప్రదేశ్ లోని లవ్ జిహాద్ ఆర్డినెన్స్ ను ఉత్తరాఖండ్ లో 2018 స్వేచ్ఛ మత చట్టాన్ని సవాల్ చేస్తూ  పిటిషన్లపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లను ఇవాళ విచారించింది.

సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్  అనే స్వచ్చంధ సంస్థ, విశాల్ ఠాక్రే వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ చట్టాల్లోని కొన్ని నిబంధనలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు  జారీ చేసింది.  వీటిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వాల వాదన వినకుండా చట్టాలపై స్టే ఇవ్వడం కుదరదని సీజేఐ తేల్చి చెప్పారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 24న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

ఉత్తర్ ప్రదేశ్ మతం యొక్క చట్ట విరుద్ద మార్పిడి ఆర్డినెన్స్ 2020 ను తెచ్చింది. బలవంతంగా వివాహం, మోసం లేదా ప్రలోభాల ద్వారా మత మార్పిడిని ఈ ఆర్డినెన్స్ ద్వారా నిషేధించారు.

ఈ ఆర్డినెన్స్ కు విరుద్దంగా పెళ్లిళ్లు చేసుకొంటే ఒకటి నుండి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన మైనర్ మహిళలను మత మార్పిడి చేస్తే రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తారు.