దీపావళికి బాణాసంచాపై నిషేధం.. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోం, తేల్చేసిన సుప్రీంకోర్ట్
ఢిల్లీలో బాణాసంచా కాల్పడంపై నిషేధం విధిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్ట్ నిరాకరించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల పటాకుల తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో బాణాసంచా కాల్పడంపై నిషేధం విధిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్ట్ నిరాకరించింది. బేరియంతో పటాకుల తయారీ, వినియోగంపై దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీం తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం శీతాకాలంలో కాలుష్య స్థాయిలను తగ్గించే కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దేశ రాజధానిలో అన్ని రకాల పటాకుల తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
గత మూడేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల పటాకులను నిషేధించే విధానాన్ని అనుసరిస్తోంది. బాణాసంచా నిషేధంపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. గడిచిన ఐదు, ఆరేళ్ల నుంచి ఢిల్లీ గాలి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. తాము దానిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది పటాకులను నిషేధించాలని తాము నిర్ణయించుకున్నామని పీటీఐని ఉటంకిస్తూ రాయ్ చెప్పారు.
ఢిల్లీలో కాలుష్యంపై కఠినంగా ప్రభుత్వం:
దీపావళి సందర్భంగా పటాకుల కాల్చడం వల్ల విపరీతమైన కాలుష్యం పెరుగుతోంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తల్లెతుంది. ఇది కాకుండా.. రాజధాని వాతావరణం దాదాపు వారం రోజుల పాటు చాలా విషపూరితంగా మారుతుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గతేడాది ఢిల్లీలో క్రాకర్స్‌పై నిషేధం విధించారు. ఢిల్లీలో దీపావళి పటాకులపై ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి.